తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల సందర్భంగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో గతంలో ఎన్నికల్లో తలపడిన వ్యక్తి కుమారుడే ఇప్పుడు పోటీకి దిగుతున్నారు.
ప్రస్తుతం భాజపా నుంచి ఈటల రాజేందర్ బరిలో దిగుతున్నారు. తెరాస తరఫున గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఆయనకు ప్రత్యర్థిగా పోటీలో నిలబెట్టింది. విశేషమేమిటంటే.. సరిగ్గా 17 ఏళ్ల కిందట 2004లో ఈటల తొలిసారిగా పోటీ చేస్తున్న సమయంలో ప్రస్తుత తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తండ్రి గెల్లు మల్లయ్య స్వతంత్ర అభ్యర్థిగా ఈటలపై పోటీ చేశారు. యాదవ సంఘం ప్రతినిధిగా కమలాపూర్ నియోజకవర్గం (ప్రస్తుతం హుజూరాబాద్) నుంచి రంగంలోకి దిగిన ఆయనకు అప్పట్లో గొడ్డలి గుర్తును కేటాయించారు. అయితే, కొన్నాళ్లు ప్రచారం చేసిన ఆయన చివర్లో ఈటలకు మద్దతు తెలిపారు. అనంతరం రాజకీయంగా ఆ కుటుంబం ఈటలకు అత్యంత సన్నిహితంగానే మెలుగుతూ వచ్చింది. కాలక్రమంలో మారిన ఇక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అనూహ్యంగా మల్లయ్య కుమారుడు గెల్లు శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో రాజేందర్‌కు ప్రత్యర్థిగా మారారు.
మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యం అయింది. ఇక్కడ ఈనెల 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.
తెరాస, భాజపా ప్రచారంలో దూసుకెళ్లండగా.. కాంగ్రెస్ నిన్ననే తన అభ్యర్థిని ప్రకటించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బరిలో నిలుపుతున్నట్లు తెలిపింది.
ఇవీచూడండి: Huzurabad By Election: వేడెక్కిన హుజూరాబాద్ బై పోల్... రంగంలోకి స్టార్ క్యాంపెయినర్లు