కరోనా ప్రభావంతో భారత్‌కు వచ్చే విమానాలు రద్దు కావటంతో ఫిలిప్పీన్స్‌లోని మనీలా విమానాశ్రయంలో పలువురు తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. గత 40 గంటలు సరైన నిద్రాహారాలు లేక.. వారంతా పడిగాపులు కాస్తున్నారు. అదృష్టవశాత్తు మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి 185 మంది విద్యార్థులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల వారూ ఉన్నారు. మనీలాలో మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన దాదాపు 80 మంది విద్యార్థులు నిలిచిపోయారు. వీళ్లంతా కౌలాలంపూర్ మీదుగా భారత్‌కు వచ్చేందుకు ఎయిర్‌ఏసియా విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ భారత్‌కు వచ్చే విమాన సర్వీసులు మంగళవారం నుంచే రద్దు కావటంతో తెలుగు విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. వీరిలో ఏపీలోని కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, అనంతపురం, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలవారు ఉన్నారు. మరికొన్ని గంటల్లో మనీలా విమానాశ్రయాన్ని అక్కడి ప్రభుత్వం మూసేస్తుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని మనీలా విమానాశ్రయం నుంచి అధికారులు బయటకు పంపేస్తున్నారు.
డబ్బులు లేవు.. తిండీ లేదు
తమ వద్దనున్న డబ్బులు అయిపోయాయని, సరైన తిండి కూడా లేకుండానే గడుపుతున్నామని విచారం వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాలయ అధికారులకు ఫోన్ చేస్తుంటే తప్పించుకునేలా మాట్లాడుతున్నారే తప్ప స్పందన లేదని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను భారత్‌కు తీసుకెళ్లే వరకూ ఇక్కడే కూర్చుంటామని, ఎక్కడికీ కదిలేది లేదని విచారం వ్యక్తం చేశారు. రెండురోజులుగా విమానాశ్రయంలోనే వాపోయారు.
ఇదీ చదవండి : కౌలాలంపూర్ నుంచి విశాఖ చేరుకున్న భారతీయ విద్యార్థులు