CS review on floods: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలతో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తుందని సీఎస్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం సహాయక చర్యల్లో పాల్గొంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరామని సీఎస్ వివరించారు.
ఇందుకు స్పందనగా 68 మంది సభ్యుల పదాతిదళం, 10 మంది సభ్యుల వైద్య బృందం, 23 మంది సభ్యుల ఇంజినీరింగ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తున్నాయన్నారు. ఈ మేరకు వర్షాలు, వరదలు, పునరావాస, సహాయక చర్యలపై జరిపిన సమీక్షా సమావేశంలో సీఎస్ తెలిపారు.
ప్రత్యేక అధికారిగా ఎం.శ్రీధర్..: ఈ సందర్భంగా సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక పడవలను సిబ్బందితో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పంపామని సీఎస్ పేర్కొన్నారు. అగ్నిమాపక విభాగానికి చెందిన 7 పడవలు సిద్ధంగా ఉన్నాయన్నారు. లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది ఈతగాళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నారని సీఎస్ వివరించారు. జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్, సింగరేణి కాలరీస్ ఎండీ ఎం.శ్రీధర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించామని తెలిపారు. సింగరేణి సంస్థకు చెందిన యంత్రాంగాన్ని ఈ సహాయ, పునరావాస చర్యలకు ఉపయోగించాలని సీఎస్ ఆదేశించారు.
ప్రాణనష్టం జరగకూడదు..: భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద పరిస్థితులపై సంబంధిత అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి..