కొన్ని రోజులుగా.. రాష్ట్రంలో భారీ, అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటల వ్యవధిలోనే రహదారులు జలమయం కావడంతోపాటు కోతకు గురవుతున్నాయి. అర్ధరాత్రి సమయాల్లో ఊహించని విధంగా విరుచుకుపడే ఈ విపత్తును ముందే గుర్తించి అప్రమత్తం కాకపోతే.. ప్రాణ నష్టంతోపాటు ఆస్తినష్టమూ భారీగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.
- రెండు రోజుల కిందట.. అనంతపురం జిల్లా ధర్మవరంలో అర్ధరాత్రి 1 గంట నుంచి మొదలైన వర్షం.. తెల్లవారుజామున 4 గంటల దాకా కుండపోతగా కురిసింది. కునుతూరు ప్రాంతంలో మూడు గంటల్లోనే 16 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. పౌర సరఫరాల శాఖ గోదాములోకి నీరు చేరి బియ్యం, పంచదార తదితర నిత్యావసరాలు తడిశాయి. దిగుమతికి వచ్చిన లారీల టైర్లు మునిగిపోయాయి.
- తిరుపతిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి 1 గంట నుంచి సుమారు గంట లోపే 7.6 సెంమీ వర్షపాతం నమోదైంది. రైల్వే బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున నీరు నిలిచి.. వాహనాలు మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. ఇది గమనించని వాహన డ్రైవర్.. కొద్దిపాటి నీరే అనే ఆలోచనతో ముందుకు వెళ్లడంతో వాహనం మునిగిపోయింది. అందులో చిక్కుకుని ఒకరు చనిపోయారు.
మేఘాల్లో.. మరింతగా తేమ
ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే.. మేఘాల్లో తేమ నిల్వ సామర్ధ్యం 7% మేర అధికమవుతుంది. రుతుపవనాల సమయంలో మేఘాల్లో ఉండే తేమకు ఇది తోడై.. కుండపోత వానలు కురుస్తాయి. ప్రస్తుతం గ్లోబల్‌వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కుండపోత వానలకు దారితీస్తున్నాయని భారత వాతావరణ సంస్థ విశ్రాంత డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ చెప్పారు.
భారీ నుంచి అతిభారీగా..
సెప్టెంబరు మొదటివారంలో అనంతపురం జిల్లా కదిరిలో అయిదారు గంటల్లోనే 20 సెం.మీ.పైగా వానలు కురవడంతో.. చెరువు కట్టలు తెగి పక్క మండలాలను వరద ముంచెత్తింది. సెప్టెంబరు 5న కాకినాడలో 18సెం.మీ.పైగా కురిసిన వానకు నగరం జలమయమైంది. జూన్ నుంచి ఒకేరోజు 15 సెం.మీ.పైగా వర్షపాతం నమోదైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. తెలంగాణలోని హనుమకొండ జిల్లా నడికుడలో 120 ఏళ్ల రికార్డును చెరిపేస్తూ సెప్టెంబరు 7న నాలుగు గంటల్లోనే 38.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఒడిశాలోని పూరి పుణ్యక్షేత్రంలో 87 ఏళ్లలో తొలిసారిగా 24 గంటల్లో 19.9 సెం.మీ. వర్షపాతం పడింది. దేశవ్యాప్తంగా చూస్తే.. 2016లో 4 తుపాన్లు, 1,864 కేంద్రాల్లో భారీ వర్షాలు, 226 కేంద్రాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. 2019లో ఎనిమిది తుపాన్లు, 3,056 కేంద్రాల్లో భారీ వర్షాలు, 554 కేంద్రాల్లో అతి భారీవర్షాలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో అతి, అత్యంత భారీవర్షాలు మరింత పెరుగుతాయనే అభిప్రాయం వాతావరణ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
గంటగంటకూ అంచనా అవసరం..
భారీవర్షం కురిసిన వెంటనే గ్రామ/వార్డు స్థాయిలో సిబ్బంది అప్రమత్తం కావడంతోపాటు.. వరద ముంచెత్తే అవకాశమున్న పల్లపు ప్రాంతాల ప్రజల్ని అర్ధరాత్రి వేళల్లోనూ హెచ్చరించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సైరన్లు మోగించే విధానం ఉండాలి. వర్షం సమయాల్లో రైల్వే అండర్‌బ్రిడ్జిలు, కోతకు గురయ్యే రహదారుల పరిస్థితిని గంట గంటకూ అంచనా వేసే విధానం అవసరం.
అనంతపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు
అనంతపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. అత్యధికంగా హిందూపురం మండలంలో 77.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం చిరుజల్లులు పడ్డాయి. జిల్లాలో ఈ నెల సాధారణ వర్షపాతం 110.7 మిల్లీమీటర్లు కాగా ఇప్పటికే 118.7(24వ తేదీ నాటికి) మి.మీలు కురిసింది.
ఇదీ చూడండి: ప్రకృతిని ఆస్వాదిస్తూ పాఠాలు..ఉత్సాహంగా బడికి పిల్లలు