Cyber Forensic Department: హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో పెండింగ్ కేసుల చిట్టా పెరిగిపోతోంది. దీని ప్రభావం కేసుల దర్యాప్తుపై పడుతోంది. ఫోరెన్సిక్‌లో కీలకమైన సైబర్ ఫోరెన్సిక్ విభాగంలో వందల కేసులు ఎటూ తేలడంలేదు. ఇప్పుడు రాష్ట్రంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ సైబర్ ఫోరెన్సిక్ విభాగంలో సిబ్బంది సంఖ్యను పెంచడంలేదు. పూర్తిస్థాయిలో పనిచేసే అధికారి ఇక్కడ ఒక్కరు మాత్రమే ఉండగా మరో 20 మంది తాత్కాలిక సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
దాంతో కేసులు విశ్లేషణ ఒక పట్టాన తేలడంలేదు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు 50కిపైగా పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రం మొత్తం తీసుకుంటే వీటి సంఖ్య 400పైమాటే. వీటిలో మూడేళ్ల క్రితం నాటి కేసులు కూడా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఛానలైజేషన్ రచ్చ: కొత్తగా ఛానలైజేషన్ పేరుతో జరుగుతున్న మార్పులు చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడ పని పూర్తిగా వ్యక్తిగత నైపుణ్యంమీదనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు టాక్సికాలజీ (విషాలను విశ్లేషించే విభాగం)లో పనిచేస్తున్న సిబ్బందికి ఆ అంశంలో నైపుణ్యం వస్తుంది. కాని ఇప్పుడు వారి విద్యార్హతల పేరుతో అక్కడ నుంచి మరో విభాగానికి మారుస్తున్నారు. దాంతో ఆ ఉద్యోగి మళ్లీ అక్కడ ఆ అంశంలో ఓనమాలు దిద్దుకోవాల్సి ఉంటోంది.
దీనిపై సిబ్బందితో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పూర్తిస్థాయి సంచాలకులను నియమించడం ద్వారానే ఈ ల్యాబొరేటరీకి మళ్లీ పూర్వవైభవం సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతోపాటు పెండింగ్ కేసులు ఎక్కువగా ఉన్న విభాగాలను గుర్తించి వాటిలో అదనపు సిబ్బందిని నియమించాలని సాక్షాత్తూ ఉద్యోగులే కోరుతున్నారు.
గాంధీ సంచాలకునిగా ఉన్నప్పుడు స్వర్ణయుగం: కేపీసీ గాంధీ సంచాలకునిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి స్వర్ణయుగంగా చెబుతారు. అప్పట్లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త విభాగాలను ఏర్పాటు చేస్తూ, ప్రపంచస్థాయి పరిజ్ఞానం సమకూర్చుకుంటూ దేశానికే ఆదర్శంగా ఉండేది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా చాలాకాలంపాటు ఇవే ప్రమాణాలు కాపాడుకుంటూ వచ్చారు. ఐదేళ్ల క్రితం శారద అవధాని సంచాలకులుగా పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ ఆమె స్థానంలో ఎవర్నీ నియమించలేదు. పోలీసు అధికారులను ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ వస్తున్నారు. పోలీసులే తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నారనే అపవాదు ఉండగా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పోలీసు ఆధ్వర్యంలో పనిచేస్తే ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.