ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆదాయం రెట్టింపవ్వాలంటే పంట దిగుబడుల్లో జిల్లాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) పేర్కొంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలకూ ఐకార్ ప్రత్యేక వ్యూహపత్రాన్ని సిద్ధం చేసింది. ఏపీలో పరిస్థితులను సమీక్షించి..సాగు విధానాల్లో లోపాలను వెల్లడించింది. ఒకే పంట ఒక జిల్లాలో గరిష్ఠ దిగుబడి వస్తే మరో జిల్లాలో కనీస స్థాయికి పడిపోవడానికి కారణాలను వివరించింది. రాష్ట్రాన్ని ఉత్తర కోస్తా జోన్ (మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు), గోదావరి జోన్ (ఉభయగోదావరి జిల్లాలు), కృష్ణా జోన్ (కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు), దక్షిణ జోన్ (చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు) వర్షాభావ జోన్ (కర్నూలు, అనంతపురం జిల్లాలు)గా విభజించి సాగు వ్యూహాలను అమలు చేస్తేనే ఫలితాలు ఉంటాయని సూచించింది. రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి సమగ్రమైన దాణా సరఫరా విధానాన్ని అమలు చేయాలని సూచించింది. పీపీపీ పద్ధతిలో ఆహారపార్కుల ఏర్పాటు, ఆగ్రోఫారెస్ట్రీకి ప్రోత్సాహం గురించి చర్చించింది. రైతు క్లబ్బులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసి మార్కెట్ లింకేజి సమస్యను నివారించాలని పేర్కొంది.
వివిధ పంటల్లో ఐకార్ గుర్తించిన సమస్యలివీ..
వరిలో సమస్యలు
తరచూ వరదలు రావడం. భూమిలో లవణస్థాయి పెరగడం. భూసారం, ఉత్పాదకత తగ్గిపోవడం. ఎండ, చలి కారణంగా ఒత్తిడి పెరగడం. పంటకోతల సమయంలో తుపాన్లు, భారీ వర్షాలు వస్తుండటం. చిన్న, సన్నకారు రైతుల అవసరాలకు తగ్గట్టు సూక్ష్మస్థాయి యంత్రాలు, స్ప్రే పరికరాలు లేకపోవడం. కూలీల కొరతతో సాగు వ్యయం పెరిగిపోవడం. ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా ఉపయోగించడం. పల్లపు ప్రాంతాల్లో మురుగునీరు వెళ్లడానికి అనువైన వ్యవస్థ లేకపోవడం. కొన్ని ప్రాంతాల్లో సరైన సాగునీటి వ్యవస్థ లేకపోవడం. పంట నిల్వకు అనువైన గోదాముల వ్యవస్థ లేకపోవడం.
జొన్న: తక్కువ దిగుబడులిచ్చే దేశవాళీ వంగడాలనే ఉపయోగించడం. ఎరువుల వినియోగంపై అవగాహన లేకపోవడం. వర్షాల మధ్య అంతరం పెరిగిపోయి తేమ తగ్గడం. పంట సాగుకు అవసరమైన విత్తనాలు సకాలంలో సరఫరా చేయకపోవడం.
మొక్కజొన్న: వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలిచేవి, స్వల్పకాలంలో దిగుబడిచ్చే వంగడాలు అందుబాటులో లేకపోవడం. భూమిలో ఆర్గానిక్ కార్బన్ కనుమరుగై దిగుబడులు తగ్గడం. పంట కోతకు, నిల్వకు మౌలిక వసతులు లేకపోవడం. తగిన ధరలు లభించకపోవడం.
నూనెగింజలసాగు: నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం. పంటకు అవసరమైన సమయంలో నీటి కొరత. పురుగులు, వ్యాధుల నియంత్రణలో అవగాహన కరవవడం. సాగు ఖర్చు, కూలీల కొరత పెరిగిపోవడం, నిల్వకు, శుద్ధికి మౌలిక వసతులు, మార్కెటింగ్ సౌకర్యాలు సరిగా లేకపోవడం
మినుము: వరికోతల తర్వాత దీన్ని సాగు చేయడంతో ఎక్కువ కలుపు తలెత్తడం. పంట చివరి కాలంలో నీటి ఎద్దడి, తెగుళ్లతో దిగుబడి తగ్గడం.
కంది: ఎక్కువగా దీన్ని అంతరపంటగా వేయడం వల్ల యాజమాన్యంలో నిర్లక్ష్యం. పంట చివరి సమయంలో నీటి ఎద్దడి. అధిక తెగుళ్లు
శనగ: చలికాలం తగ్గి ఉష్ణోగ్రతలు పెరగడం. కరువు పరిస్థితులు. చీడపీడల సమస్యలు
పాడి పరిశ్రమకు ఇబ్బందులు
స్థానిక జాతి పశువులను పోషిస్తుండటంతో ఎక్కువ దిగుబడులు రాకపోవడం. సంకరజాతి పశువులు స్థానిక పరిస్థితులకు తట్టుకోకపోవడం. పాడిపశువుల పోషణలో రైతులకు తగిన అవగాహన లేకపోవడం. పశువులను మేపడానికి పచ్చికబయళ్లు లేకపోవడం. ఎండుగడ్డి కొరత, దాణా ధరలు పెరిగిపోవడం.
చేపల పెంపకంలో అవరోధాలు
అవసరమైనంత స్థాయిలో సకాలంలో నాణ్యమైన చేప పిల్లల్ని అందించలేకపోవడం. ఒకే రకమైన సాగు విధానంతో ఉత్పాదకత తగ్గిపోవడం. సామాజిక, పంచాయతీ చెరువుల్లో సంప్రదాయసాగుతో ఎక్కువ దిగుబడులు రాకపోవడం. చెరువుల చుట్టుపక్కల వాతావరణం, నీటి నాణ్యత నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడం.
ఇదీ చదవండి : ఇంట్లో ఉంటే వైద్యం అందదంతే!