Drunken Drivers Have to Donate Blood : చిత్తుగా మద్యం తాగి మత్తుగా కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు నడుపుకొంటూ వెళ్తున్న మందుబాబులూ.. ఇకపై జాగ్రత్త.. పోలీసులకు పట్టుబడితే జరిమానా చెల్లించడంతోపాటు రక్తదానం చేయాల్సి ఉంటుంది. పంజాబ్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులూ పరిశీలిస్తున్నారు.
Blood donation by drunken drivers : పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వుల్లో సాధ్యాసాధ్యాలు, ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఏవిధంగా ఎదుర్కోవాలన్న అంశాలపై న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మద్యం తాగి పట్టుబడినవారికి కోర్టులు జరిమానాతోపాటు 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి 6 నెలల్లో 15 వేలమందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధికులకు 6 నెలలపాటు డ్రైవింగ్ లెసెన్స్ రద్దయింది.
సామాజిక సేవలో భాగంగా.. పంజాబ్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై నగర ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారుల్లో కొందరు అక్కడి రవాణాశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సామాజికసేవకు సంబంధించిన అంశాలు చాలానే ఉన్నా రక్తదానం అంశంపై సందిగ్ధత ఉందని మనవాళ్లు భావిస్తున్నారు. రక్తదానం స్వచ్ఛందంగా చేసేది. తప్పనిసరి చేస్తే మందుబాబులు న్యాయస్థానాలకు వెళ్లే అవకాలున్నాయని అంచనా వేస్తున్నారు.
సవరణ చట్టం నుంచే.. రహదారులపై ప్రమాదాల నియంత్రణ, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం మోటారు వాహనాల సవరణ చట్టం-2019ను తీసుకువచ్చింది. దీనిప్రకారం దేశవ్యాప్తంగా కోర్టులు అంశాల వారీగా జరిమానాలు విధిస్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్లిన పంజాబ్ ప్రభుత్వం రక్తదానం చేయాలంటూ ఏకంగా ఉత్తర్వులే తీసుకువచ్చింది.