వైకాపా అధినేత జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోని ఈడీ కేసును కూడా సీబీఐ న్యాయస్థానానికి బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్స్ కోరింది. అరబిందో, హెటిరో భూముల కేటాయింపునకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో 2016లో ఈడీ దాఖలు చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి తదితరులు నిందితులుగా ఉన్నారు.
అయితే ఆ తర్వాత మరో ఐదు ఛార్జ్ షీట్లను సీబీఐ కోర్టులో ఈడీ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నాంపల్లి సెషన్స్ కోర్టులో ఇవాళ కేసు విచారణ జరిగింది. ఇవాళ్టి విచారణకు మినహాయింపు కోరుతూ జగన్, విజయ్ సాయిరెడ్డి తదితరుల అభ్యర్థనను నాంపల్లి మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు అంగీకరించింది. ఈసీఐఆర్ నుంచి సీబీఐ కోర్టులో సమర్పించారు కాబట్టి.. ఛార్జ్ షీట్లను కూడా అక్కడే దాఖలు చేయాలని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు.
సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉందని.. ఈనెల 17న విచారణ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. బదిలీపై తమకు అభ్యంతరం లేదని ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో కేసు విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశమని.. ఈనెల 20న అభియోగాల నమోదుపై విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: