ఆయిల్ ట్యాంకర్ల నుంచి అక్రమంగా డీజిల్ తీస్తున్న ముఠాను ఈనెల 18న రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 20వేల లీటర్ల డీజిల్ సహా ట్యాంకర్‌ను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు ఉపేందర్ సహా అతనికి సహకరించిన ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టగా కీలక వివరాలు బయటకొచ్చాయి.
గమ్యం చేరకుండానే..
చర్లపల్లిలోని పెట్రోలియం కంపెనీల నుంచి సరకును తీసుకెళ్లే ట్యాంకర్లను గమ్యస్థానం చేరేలోపు సదరు ట్యాంకర్ డ్రైవర్ల సాయంతో దారి మళ్లించడమే ఆ ముఠా పనిగా గుర్తించారు ట్యాంకర్లనుంచి అక్రమంగా డీజిల్ తీసి డబ్బాల్లోనింపి ఇతర వాహనదారులకు విక్రయిస్తున్నారని నిర్ధరించారు. వచ్చిన లాభంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్‌కు వాటా ఇస్తున్నట్లు తేల్చారు. పోలీసుల సహకారంతోనే అక్రమ దందా కొనసాగుతున్నట్లు... దర్యాప్తులో వెల్లడి కావడంతో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సీరియస్‌గా తీసుకున్నారు.
పోలీసులు సైతం..
ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణలో పోలీసుల డీజిల్ దందానిజమేనని తేలడం వల్ల వారిపై కమిషనర్... వేటు వేశారు. అందులో ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్... హెడ్‌కానిస్టేబుల్, ఎస్బీ కానిస్టేబుల్‌తో పాటు మేడిపల్లి ఠాణాలో పనిచేసే ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇతర పోలీసుల పాత్రపైనా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
పునరావృతం కాకుండా...
రెండున్నరేళ్ల క్రితం వరకు ఘట్‌కేసర్, మేడిపల్లి పరిసరాల్లో అక్రమ డీజిల్ దందా యథేచ్ఛగా సాగేది. చరపల్లిలోని ఆయిల్ కంపెనీల నుంచి డీజిల్ తీసుకెళ్లే ట్యాంకర్ల నుంచి సరకుతీసే ముఠాలు పదుల సంఖ్యలో ఉండేవి. 2018 జనవరి 12న చెంగిచర్ల సమీపంలో యథావిధిగా ట్యాంకర్ నుంచి డీజిల్ తీస్తున్న క్రమంలో పేలుడు జరిగి ఇద్దరు చనిపోగా... 10 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటనపై ప్రత్యేక దృష్టిసారించిన సీపీ మహేశ్ భగవత్... ఘటన తర్వాత ఆ పరిధిలో పనిచేసే ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేశారు. 24 గంటల పాటు తనిఖీ చేసేలా బృందాలు ఏర్పాటు చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మరోసారి డీజిల్ దందా బయటికి వచ్చింది. అక్రమాలకు సహకరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహకరించేది లేదని సీపీ స్పష్టంచేశారు. ఆయిల్ కంపెనీల నుంచి బయటికి వచ్చే ప్రతి ట్యాంకర్‌పైనా నిఘా ఉంచాలని... కిందిస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి: కరోనా చికిత్స ఖర్చుపై 57 శాతం మంది ఆందోళన!