తెలంగాణలో మంత్రిగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్ భాజపాలో చేరడంతో హుజూరాబాద్ ఎన్నికలు (huzurabad by election ) ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా ఉపఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. ఎన్నికలను ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు సవాల్‌గా స్వీకరించాయి. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్(తెరాస), ఈటల రాజేందర్(భాజపా), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)ల తరఫున మూడు పార్టీలు ప్రచారంలో నువ్వా-నేనా అనే తరహాలో పోటీ పడ్డాయి. ఓటర్ల మన్ననల్ని పొందేందుకు చెమటోడ్చాయి.
తెరవెనుక మంత్రాంగానికి సిద్ధం
ఇప్పటివరకు ప్రచారంలో ప్రత్యక్షంగా ఓటర్లను మెప్పించిన పార్టీలు ఇకపై తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమయ్యాయి. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ఓటుకు ఇంత మొత్తమనేలా నగదు పంపిణీకి రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మద్యం సీసాలను పలుచోట్ల పంపిణీ చేశారనే ప్రచారం వినిపిస్తోంది. దసరా పర్వదినం సందర్భంగా ఆయా పార్టీలవారు మాంసంతోపాటు మద్యాన్ని విరివిగా పంచారని అంటున్నారు. పోలింగ్‌కు ముందు 28, 29 తేదీల్లో లోలోపల జరిగే ప్రచారం అభ్యర్థుల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లుగా అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలకు భిన్నంగా తాయిలాలు, ప్రలోభాలపర్వం అధికంగా కనిపించే వీలుంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా నియోజకవర్గంపై దృష్టి సారిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకునేలా ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.
హోరాహోరీ ప్రచారం
మూడు ప్రధాన పార్టీల తరఫున ప్రచారం హోరాహోరీగా సాగింది. మాటల తూటాలు పేలాయి. పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. తెరాస తరఫున మంత్రి హరీశ్‌రావు ప్రచార బాధ్యతను తన భుజాన మోశారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ముమ్మరంగా ప్రచారం చేశారు. భాజపా తరఫున కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, నిత్యానందరాయ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, కాంగ్రెస్ తరఫున రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొననున్నారు.