అమ్మానాన్నలు అనారోగ్యంతో చనిపోయారు. ఆ అక్కాతమ్ముడు దిక్కులేని వారయ్యారు. చేతిలో చిల్లగవ్వ లేదు. వారికున్న చిన్న ఇంట్లోనే బతుకు వెల్లదీస్తున్నారు. తమ్ముడి కోసం తన పై చదువులు విరమించుకొని... కుట్టుమిషన్ పనులు నేర్చుకొని ఇంటిని నడుపుతోంది ఆ యువతి. తన తమ్ముడిని అమ్మా, నాన్నా, అన్నీ తానై సాకుతోంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బస్వాపూర్‌కు చెందిన 20 ఏళ్ల అమ్మాయి శ్రీలత కథ ఇది.
శ్రీలత తండ్రి ఐదేళ్ల క్రితం మరణించగా... ఆ తర్వాత మూడేళ్లకే తల్లి కన్నుమూసింది. అప్పటికీ తన తమ్ముడు ప్రశాంత్ పదో తరగతి పూర్తి చేశాడు. అమ్మానాన్నల వైద్య ఖర్చుల కోసం ఉన్న భూమినీ అమ్మేశారు. ఇక వారిలో చేతిలో చిల్లగవ్వ లేదు. చేసేది లేక ఇంటర్మీడియట్తోనే చదువు మానేసింది శ్రీలత. కుట్టుపని నేర్చుకొని ఇంటిని నెట్టుకొస్తుంది. ఆడపిల్ల కదా పెళ్లి చేసి ఓ ఇంటికి పంపించాలని చుట్టుపక్కల వాళ్లు ప్రయత్నించినా ఆమె నిరాకరించింది. తాను పెళ్లి చేసుకొని వెళ్లిపోతే తమ్ముడు ఒంటరివాడు అవుతాడని మూడు ముళ్ల బంధానికి దూరంగా ఉంది.
తమ్ముడి కోసం త్యాగం
ప్రస్తుతం శ్రీలత తమ్ముడు ప్రశాంత్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తమ్ముడికి ఏదైనా ఉపాధి దొరికే వరకు తను అలాగే ఉంటానని... వచ్చిన పెళ్లి సంబంధాలను సున్నితంగా తిరస్కరించింది. చిన్న రేకుల షెడ్డులో.. కుట్టుపని ద్వారా నామమాత్రంగానే వచ్చే డబ్బులతో జీవితాన్ని వెల్లదీస్తున్నారు ఆ అక్కాతమ్ముళ్లు. ఎవరైనా దాతలు స్పందించి ఆదుకుంటే వారి బతుకు బాగుపడుతుంది. చేసేది చిరు సాయమైనా వారి బంగారు భవిష్యత్‌కు బాసటగా నిలుస్తుంది.
కొత్త ఇంటికి భరోసా...
ఈటీవీ భారత్ కథనం "అక్కే... అమ్మా, నానై" అనే కథనానికి మంచి స్పందన లభించింది. శ్రీలత దీనగాథపై దాతలు స్పందించారు. సాయం చేసేందుకు ముందుకొచ్చారు. విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు అరికెపూడి రఘు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నందమర్రి... రేకుల షెడ్డు స్థానంలో కొత్త ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నాలుగు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఉగాదిలోగా కొత్త ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
చదువు బాధ్యత...
నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కళింగ కృష్ణ వారిద్దరి చదువు బాధ్యత తీసుకుంటామన్నారు. రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు రమేశ్ రూ.పది వేల చెక్కు అందించారు. వీరు పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఒకరు 50 వేలు వారికి అందేలా చొరవ తీసుకున్నారు. విదేశాల నుంచి పలువురు ఫోన్ చేసి వారికి సాయం చేసేందుకు వీలుగా వివరాలు తీసుకున్నారు. గుజరాత్ లో ఉంటున్న లక్ష్మీదేవి వీరిద్దరి చదువు బాధ్యత తానే తీసుకుంటానని ముందుకొచ్చారు. తక్షణ సాయంగా 5000 వారి ఖాతాలో జమ చేశారు.
ఇదీ చదవండి: