FIRE ACCIDENT: తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలోని పారిశ్రామికవాడలో తెలంగాణ చేనేత సహకార సంఘం-టెస్కో గోదాంలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉవ్వెత్తున ఎగసిపడ్డ అగ్నికీలలకు పరిసర ప్రాంతవాసులు భయాందోళనలకు గురయ్యారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల నుంచి 6 అగ్నిమాపక వాహనాలు మంటలను అర్పేందుకు శ్రమించాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో మంటల ధాటికి గోదాం కుప్పకూలింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన నేత కార్మికులు నేసిన తివాచీలు, తువ్వాళ్లు, జంపఖానాలు, బెడ్ షీట్లు, తదితర వస్త్ర సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది.
ప్రమాదానికి కారణమదేనా..?: గోదాంలో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదు. గోదాం చుట్టూ చెత్తా, చెదారం, ఎండిన ఆకులపై ఎవరైనా బీడీ, సిగరెట్ కాల్చి వేయడంతో క్రమంగా మంటలు పెరిగి ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కొంచెం ముందు వచ్చి ఉంటే ప్రమాద తీవ్రత తగ్గేదని.... గోదాం అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయని.. అందువల్ల గోదాం యజమానులు జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొన్నారు.
మంటలు వ్యాపించి ఉంటే అంతే సంగతి..: కారణమేదైనా దాదాపు రూ.35 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు బూడిదయ్యాయని ప్రాథమికంగా అంచనా వేశారు. గోదాం నిర్వాహకులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. రెండేళ్ల నుంచి సరకు సరఫరా కాకుండా గోదాంలోనే ఉండిపోయింది. సకాలంలో వీటిని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలలకు ఇచ్చి ఉంటే సరకు పేరుకుపోయి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోదాంలో తివాచీలే లక్షకుపైగా ఉంటాయని అంచనా. బతుకమ్మ చీరల పంపిణీతోపాటు తివాచీలనూ పంపిణీ చేయాలన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో గోదాంలోనే కాదు.. నేతన్నల వద్ద సైతం లక్షల సంఖ్యలో తివాచీలు పేరుకుపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఎల్పీజీ గోదాం ఉండగా.. మంటలు వ్యాపించి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
కష్టం నేలపాలు..: ఆస్తి నష్టం భారీగా ఉన్నా.. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ రేయింబవళ్లు శ్రమించి నేతన్నలు పడిన కష్టం.. బుగ్గిపాలవడం వేదనకు గురి చేస్తోంది.