Higher education projects ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు పోలా భాస్కర్, నాగరాణి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్ర, ఆచార్య నాగార్జున, శ్రీవేంకటేశ్వర, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల్లో దూరవిద్యలో అప్రెంటిస్‌షిప్ అమలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులను అందించి, వారికి అప్రెంటిస్‌షిప్ బాధ్యతలను ప్రైవేటుసంస్థకు అప్పగిస్తారు. ఈ రెండు పనులు నిర్వహించే సంస్థలకు ఈ ప్రాజెక్టును కట్టబెట్టనున్నారు. ఎంపికైన సంస్థ విద్యార్థులకు మూడేళ్లు అప్రెంటిస్‌షిప్‌ను అందించాలి.
* విశ్వవిద్యాలయాలన్నింటికీ కలిపి ఏకీకృత కంప్యూటరీకరణ విధానం అమలు చేసే బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గతంలో విశ్వవిద్యాలయాలపై ఆర్థికభారం లేకుండా ఉండేందుకు ఈ పనిని సీఎఫ్‌ఎస్‌ఎస్‌కు అప్పగించారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కొంతవరకు ప్రక్రియను పూర్తిచేశారు. ఈ సంస్థ సరిగా చేయట్లేదని ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. విశ్వవిద్యాలయాల నిర్వహణ, సమాచార విధానం అభివృద్ధి పేరుతో దీన్ని అమలుచేస్తారు. టెండర్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుంది. ఖర్చును విశ్వవిద్యాలయాలు భరించాలి.
* ఉన్నతవిద్యలో నైపుణ్య కోర్సులు, ఇంటర్న్‌షిప్‌ల పర్యవేక్షణకు ప్రత్యేక పర్యవేక్షణ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తారు.
* అధ్యాపకులకు డిజిటల్ పరివర్తనపై వర్చువల్ శిక్షణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించే మరో ప్రాజెక్టుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
* దాతలు, పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించేందుకు ప్రత్యేకంగా ఏపీ ఉన్నతవిద్య అడ్వాన్స్‌డ్, డెవలప్‌మెంట్ సొసైటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ సొసైటీ ద్వారా ఉన్నత విద్యామండలి విరాళాలు సేకరిస్తుంది. ఈ సొసైటీలోనూ కొత్త నియామకాలు చేపట్టనున్నారు.
ఇవీ చదవండి: