విశ్వవిద్యాలయాలను సమ్మిళిత విద్య, పరిశోధన వర్సిటీలు (మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ-మేరు)గా మార్పు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేపట్టింది. ఈ విధానంలో అన్ని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో అన్ని రకాల కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా దీన్ని అమలు చేయబోతున్నారు.
కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, పరిశోధనలకు ప్రాధాన్యం, అధ్యాపకుల నియామకాలు, నిధుల అవసరాల నేపథ్యంలో విడతల వారీగా మార్పు చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో కాకినాడ, అనంతపురంలలోని జేఎన్‌టీయూలు, ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక వర్సిటీ(ఆర్జీయూకేటీ)లను ‘మేరు’గా అభివృద్ధి చేయనున్నారు. రెండో దశలో ఉన్న పద్మావతి మహిళా వర్సిటీనీ మొదటి విడతలోనే చేర్చాలని అధికారులు భావిస్తున్నారు.
అయిదేళ్లలో అన్నీ..
ప్రస్తుతం ఆర్జీయూకేటీ, జేఎన్‌టీయూలు కేవలం సాంకేతిక విద్యను మాత్రమే అందిస్తున్నాయి. కొత్త విధానంలో లిబరల్ ఆర్ట్స్, సైన్సు, సోషల్ సైన్సు, భాషలు, యోగా, సంగీతం, నృత్యం, డ్రామాలాంటివి ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులు బీటెక్‌తోపాటు ఇతర కోర్సుల్లోనూ అనర్స్ మైనర్ డిగ్రీలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకురావాలని భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లల్లో అన్ని వర్సిటీలను ‘మేరు’గా మార్చాలని ప్రణాళిక రూపొందించారు.
కొత్త కోర్సులు, పరిశోధనలు ప్రవేశ పెట్టేందుకు అవలంబించాల్సిన విధానంపై విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీలు ఇప్పటికే నివేదికలను ఉన్నత విద్యామండలికి సమర్పించాయి. ఈ నివేదికల అధ్యయానికి మరో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి కొత్త విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు. ఈలోపు జాతీయ విద్యావిధానం ప్రకారం వర్సిటీల వారీగా కావాల్సిన వనరులేంటో పరిశీలించి బడ్జెట్ అవసరాలు గుర్తించనున్నారు. మరోవైపు సమ్మిళిత విద్య అమలుకు చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఇటీవలే వర్సిటీలకు లేఖలు రాసింది.
ఇదీ చదవండి:
Rains effect in AP cities: వానొస్తే వణుకే.. రాష్ట్రంలోని అత్యధిక నగరాల్లో ఇదే పరిస్థితి!