HC STAY ON GRADE 2 POSTS : ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్-2 నియామకాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 560 గ్రేడ్-2 పోస్టుల నియామకాలకు ప్రభుత్వం జీవో విడుదల చేయగా.. 38 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు ఇటీవల రాత పరీక్షలు రాశారు. మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే ఎంపిక చేస్తున్నారనే ఆరోపణల వచ్చిన నేపథ్యంలో.. కొందరు అభ్యర్ధులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం 50 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.
వీటిలో 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు మౌఖిక పరీక్ష నిర్వహించాలన్నారు. అయితే రాత పరీక్షను ఈనెల 18న నిర్వహించిన అధికారులు, మౌఖిక పరీక్ష నిర్వహించకుండానే నియామకాలకు చర్యలు చేపడుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భర్తీల్లో అవకతవకలు జరిగాయని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం నియామకాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: