అమరావతి అసైన్డ్ భూముల విషయంలో.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదుచేసిన కేసులో దర్యాప్తుతోపాటు తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ ఈ ఏడాది మార్చి 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరో ఎనిమిది వారాలు పొడిగించింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు నాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.
రాజధాని అసైన్డ్ భూముల విషయంలో.. వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఈ కేసును కొట్టేయాలని వీరిద్దరూ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.
వాటిపై మార్చి 19 న విచారణ జరిపిన హైకోర్టు.. సీఐడీ నమోదు చేసిన కేసుపై స్టే విధించింది. తాజాగా.. ఈ వ్యాజ్యాలు మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. స్టే ఉత్తర్వులు ముగియనున్న నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని అభ్యర్థించారు. దీంతో ఎనిమిది వారాలు పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.
ఇదీ చదవండి: AMARAVATHI CASES: సోమవారం నుంచి హైకోర్టులో రాజధాని కేసుల విచారణ