ఉపాధి హామీ మండలిలో నాన్ అఫిషియల్ సభ్యులను తొలగించడానికి కారణాలేమి జీవోలో పేర్కొనలేదని హైకోర్టు ఆక్షేపించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది. సభ్యుల తొలగింపు నిమిత్తం పంచాయతీరాజ్ శాఖ ఈనెల 10న జారీచేసిన జీవో 154ను సవాలు చేస్తూ నాన్ అఫిషియల్ సభ్యులు ఎస్.సుబ్బరామయ్యతోపాటు మరో ఏడుగురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిబంధనల ప్రకారం పిటిషనర్ల పదవీకాలం మూడేళ్లు ఉంటుందన్నారు. నోటీసులు ఇవ్వకుండా.. తొలగింపునకు కారణాలు పేర్కొనకుండా ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆరువారాలపాటు హైకోర్టు సస్పెండ్ చేసింది.
మానవ హక్కుల కమిషన్లో ఖాళీలు భర్తీ చేయాలని వ్యాజ్యం
ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషన్లో ఖాళీలను భర్తీ చేసేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బి.మోహనరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గతంలో మానవహక్కులను పరిరక్షించడంలో కమిషన్ ఛైర్‌పర్సన్, సభ్యులు పాత్ర క్రియాశీలకంగా ఉండేదన్నారు. ఇద్దరు సభ్యుల కాలపరిమితి 2015 ఆగస్టుతో ముగిసిందన్నారు. ఛైర్‌పర్సన్ జస్టిస్ ఎ.కక్రూ 2016 డిసెంబర్లో పదవీ విరమణ చేశారని... ప్రస్తుతం 8వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.