విజయవాడలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనంలో సిద్ధమైన మూడు అంతస్తులను సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వివరాలు సమర్పించేందుకు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ అభ్యర్థించడంతో విచారణను మే 6కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
విజయవాడలోని కోర్టు భవన సముదాయ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ.. న్యాయవాది చేకూరి శ్రీపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాజాగా జరిగిన విచారణలో గుత్తేదారు తరపున సీనియర్ న్యాయవాడి బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. భవనంలోని మూడు అంతస్తులను సిద్ధం చేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అప్పగించామన్నారు. అయితే.. వాటికి డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. వ్యర్థ నీరు నిర్వహణ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిరాకరిస్తున్నట్లు కోర్టుకు వివరించారు. ఏజీ శ్రీరామ్ స్పందిస్త.. వ్యర్థ నీరు నిర్వహణకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని.. కోర్టు హాళ్ల ప్రారంభ తేదీని తెలియజేస్తే ఫర్నిచర్ సమకూరుస్తామన్నారు. 6న జరిగే విచారణలో పూర్తి వివరాలు సమర్పిస్తామన్నారు. అందుకు ధర్మాననం అంగీకరిస్తూ.. విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
Farmers Letter to CRDA : అమరావతి రైతులకు అవమానం.. ముఖం చూడని సీఆర్డీఏ కమిషనర్