సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచే ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పోరేషన్‌కి నిధులు మళ్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ వేసింది. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని మొదట సంచితనిధిలో వేస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులోనూ సంచితనిధి నుంచే ఏపీఎస్ డీసీకి నిధులు బదిలీ చేస్తామని కోర్టుకు హామీ ఇస్తున్నామని స్పష్టంచేసింది. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 11 వేల 957 కోట్లు సంచిత నిధికి జమలయ్యాయని తెలిపింది. నవంబర్ 2020 నుంచి జూన్ 2021 వరకు 1603 కోట్లు నిధుల్ని ఏపీఎస్ డీసీకి బదలీ చేశామని పేర్కొంది. సంక్షేమ పథకాల అమలు నిమిత్తం ఏపీఎస్‌డిసికి నిధులు మళ్లిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఎస్డీసీ వైస్ చైర్మన్ ఎస్.ఎస్ రావత్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
ఆదాయ, వ్యయాల విషయాలు ప్రభుత్వ పరిధిలోనివన్నారు. పిల్ను కొట్టేయాలని కోరారు. పన్నుల రూపంలో వస్తున్న ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమచేయకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ కు మళ్లిస్తున్నారని పిటిషనర్ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. ఏపీఎస్ డీసీ చట్టంలోని సెక్షన్ 12 (1)(4)(5) ను రద్దు చేయాలని కోరారు. ఏపీఎస్‌డీసీ తీసుకునే 25 వేల కోట్లు రుణానికి విశాఖలోని ప్రభుత్వ భూములు, భవనాలను తనఖా పెట్టేందుకు వీలు కల్పిస్తు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యాజ్యంలో తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ వడేరా వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కు రిప్లై కౌంటర్ వేయడానికి సమయం కావాలన్నారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి:
ACHENNAYUDU: 'ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ.. తెలుగు జాతికి ద్రోహమే'