గతంలో జరిగిన పనులను బకాయిలు చెల్లించకుండా వచ్చిన నిధులను ఆపి ఉంచే అధికారం తాజాగా ఎంపికైన సర్పంచ్‌లకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు చెలించకపోవడంపై గతంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. బకాయిలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో పంచాయతీల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేసింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు కొందరు... పూర్వ పనులకు నిధులు చెల్లించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారి చెక్ పవర్‌ను రద్దు చేయాలని డీపీవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.
ఖాతాలకు నిధులు జమ చేసినా.. చెల్లించని సర్పంచుల నుంచి డీపీవోలు సంజాయిషీ కోరుతున్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం వి.అప్పాపురం గ్రామ సర్పంచ్ కె.రోజారాణికి జిల్లా పంచాయతీ అధికారి షోకాజ్ నోటీసు జారీచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల్ని విస్మరించినందుకు మూడు నెలల పాటు నిధులు ఉపసంహరించకుండా సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారు. ఆ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ.. సర్పంచ్ రోజారాణి హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రామస్థుల నుంచి ఫిర్యాదు అందిందని నిర్మాణ పనులకు సంబంధించిన రికార్డులు సైతం తన వద్ద లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిధులు చెల్లించలేదన్నారు. ఆ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి ..సర్పంచ్ కాకముందు జరిగిన పనులకు వచ్చిన నిధుల్ని పట్టి ఉంచుకునే అధికారం మీకెక్కడిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పనులకు బకాయిలు చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు అడ్డుపడేలా మీ చర్యలున్నాయని మండిపడ్డారు. కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు హెచ్చరించడంతో సర్పంచ్ తరపు న్యాయవాది వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతివ్వాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. న్యాయస్థానం సమయాన్ని వృథా చేసినందుకు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు 2వారాల్లో రూ. 5 వేలు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి..
రాజన్న రాజ్యమని చెప్పుకునే హక్కు సీఎం జగన్‌కు లేదు: మండలి బుద్ధ ప్రసాద్