కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో రుసుములను కట్టడి చేసేందుకు హైకోర్టు చర్యలు చేపట్టింది. కరోనా బాధితులు/వారి కుటుంబసభ్యులు ఆసుపత్రులకు చెల్లింపులను నోడల్ అధికారులు లేదా హెల్ప్‌డెస్క్ మేనేజర్ల పర్యవేక్షణలో జరిపే విషయంపై దృష్టిసారించాలని, దీనికి తక్షణం విధివిధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సొమ్ము చెల్లించిన వ్యక్తి నుంచి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలని పేర్కొంది. తద్వారా అడిగినంత చెల్లిస్తేనే మృతదేహాల్ని అప్పగిస్తామనేదానికి అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొంది. ఆసుపత్రి నోడల్ ఆఫీసర్లు లేక హెల్ప్ డెస్క్ మేనేజర్ల ఫోన్ నంబర్లను ప్రజలకు తెలిసేలా తక్షణం ప్రచురించాలని ఆదేశించింది. దుకాణాల వద్ద రద్దీ నియంత్రణకు కానిస్టేబుల్‌ను నియమించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు స్పష్టంచేసింది. పట్టణాల్లో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటుపై అధికారులతో మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌కు స్పష్టంచేసింది.
కొవిడ్ రోగుల్ని దగ్గర్లోని కరోనా ఆసుపత్రులు తరలించే నిమిత్తం రవాణా సౌకర్యాలు కల్పించే విషయంలోనూ వివరాలు సమర్పించాలని స్పష్టంచేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం, 800 టన్నుల అక్సిజన్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో.. ఆక్సిజన్ కేటాయింపు పెంచే అంశాన్ని సహాయ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళాతాన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. 50 క్రయోజనిక్ ట్యాంకర్లు, 10 ఆక్సిజన్ ట్యాంకర్లు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినందున ఈ విషయంలో వివరాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
కార్పోరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు వైద్య సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) రాష్ట్ర అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్, కరోనా కట్టడి విషయంలో మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
బుధవారం జరిగిన విచారణలో ఏపీతో పోలిస్తే కరోనా కేసులు తక్కువగా ఉన్న తెలంగాణకు 690 టన్నులు, ఏపీకి 590 టన్నుల ఆక్సిజన్ కేంద్రం కేటాయిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తెలంగాణతో పాటు ఏపీ అవసరాల మేరకు ఆక్సిజన్ సరఫరా చేయాలని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ వయల్స్ లభ్యతపై ధర్మాసనం ఆరా తీసింది. ఏఎస్‌జీ బదులిస్తూ.. 2.81 లక్షల వయల్స్ రాష్ట్రానికి పంపామన్నారు. అదనపు ఆక్సిజన్ కేటాయింపు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందన్నారు. రాష్ట్రంలో 42 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. జూన్ మొదటి వారానికి 15 ప్లాంట్లు, మిగిలినవి మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. మూడు నెలలు చాలా ఆలస్యమని, సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ధర్మాసనం తెలిపింది. వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉత్పత్తి అవుతున్న 100 టన్నుల ఆక్సిజన్‌ను ఏపీ అవసరాలకు కేటాయించడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఏఎస్‌జీకి సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. రెమ్‌డెసివిర్ కొరత ఉందన్నారు. కేంద్రం చెబుతున్న లెక్కల్లో వ్యత్యాసం ఉందన్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు, బాధితుల ఆరోగ్య స్థితిగతులపై బులెటిన్ విడుదలకు ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ హెల్ప్ డెస్క్ మేనేజర్లు పడకల లభ్యతను పర్యవేక్షణ వ్యవస్థకు తెలియజేయాలని కోరామన్నారు. ఏపీ కొవిడ్ డాష్‌బోర్డ్ వెబ్‌సైట్లో బెడ్ల లభ్యత వివరాలు ఉంటాయన్నారు. నోడల్ అధికారుల, హెల్ప్ డెస్క్ మేనేజర్లు.. కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరిస్థితులు తదితర వివరాలు తెలియజేస్తున్నారన్నారు. కంటైన్‌మెంట్ జోన్లను ఏమైనా ప్రకటించారా అన్న ధర్మాసనం ప్రశ్నకు.. కేసులు ఎక్కువగా ఉన్నందున రాష్ట్రం మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించాల్సి వస్తుందని బదులిచ్చారు.
పిటిషనర్ల తరఫున నర్రా శ్రీనివాసరావు, వాసిరెడ్డి ప్రభునాధ్, జి.ఉమాశంకర్, పొత్తూరి సురేశ్‌కుమార్, అశోక్‌రామ్, అమికస్‌క్యూరీ వైవీ రవిప్రసాద్ తదితరులు వాదనలు వినిపించారు. కొవిడ్ కేర్ కేంద్రాలను నియోజకవర్గం వారీగా ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రమాదానికి గురైన వారినీ కరోనా పరీక్ష ఫలితాలు లేవనే కారణంతో ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదన్నారు. దీంతో ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పగా.. ప్రమాదాల భారిన పడిన కొవిడ్ రహిత పేషెంట్లను విస్మరించొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది.
రుయా మరణాలపై వివరాలు సమర్పించండి..
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక సంభవించిన మరణాలపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. రుయాలో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు మరణించడంపై తిరుపతికి చెందిన జి.భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఆయన తరఫున న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి వాదిస్తూ.. మే 10 న రుయా ఆసుపత్రిలో 56 మంది మరణించగా 11 మందే చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించి, వారికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందని, మొత్తం అందరి కుటుంబసభ్యులకు రూ. 25 లక్షల చొప్పున ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: