ఉద్యోగి మరణిస్తే కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకానికి అవకాశం కల్పిస్తూ..... కనిపించకుండా పోయిన ఉద్యోగి విషయంలో ఏడేళ్ల వరకు వేచి చూడాల్సి రావడం సరికాదని హైకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకంపై కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి కుమారుడు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో ప్లాంట్ అటెండెంట్‌గా పనిచేస్తూ సుబ్బారావు అనే ఉద్యోగి.... 2001 ఆగస్టు 26న కనిపించకుండా పోయారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 2001 డిసెంబర్ 31 న సుబ్బారావు ఆచూకి లభ్యం కాలేదంటూ పోలీసులు తుది నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తూ...కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తండ్రి అదృశ్యం అయినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నాటికి ….ఆయనకు ఏడేళ్లకు పైగా సర్వీస్ లేదన్న కారణంతో అధికారులు తిరస్కరించారు. ఈ విషయంపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన హైకోర్టు.... సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగి విషయంలో ఏడాదిలోపే కారుణ్య నియమాకానికి అవకాశం కల్పిస్తుండగా...కనిపించకుండాపోయిన వ్యక్తి వ్యవహారంలో ఏడేళ్ల సర్వీస్‌న నిబంధన ఏంటని ప్రశ్నించింది. అదృశ్యమైన వారి ప్రయోజనాల కల్పనలో వివక్ష కనిపిస్తోందని....ఈ షరతులు కారుణ్య నియామక పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి షరుతులు విధించడం ఆశ్రయం కోల్పోయిన కుటుంబాలకు కల్పించే సహాయాన్ని నిరాకరించడమే అన్న ధర్మాసనం... చనిపోయిన, కనిపించకుండా పోయిన ప్రభుత్వ ఉద్యోగి విషయంలో వివక్ష చూపకూడదని సూచించింది.
తగిన పోస్టులో కారుణ్య నియామకం కింద పిటిషనర్ శ్రీనివాసరావును నియమించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్టీపీసీ అధికారులను ఆదేశించింది. అదృశ్యమైన ఉద్యోగుల కుటుంబాల దయనీయ స్థితిని పరిగణనలోకి తీసుకొని, వారి పట్ల మరింత సానుభూతి చూపి మానవతా దృక్పథంలో ఆదుకోవడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించేందుకు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నామని వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి:
ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్..ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య