స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం హైకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. భారత రాజ్యాంగం ప్రజలందరికీ న్యాయం పొందేందుకు హక్కు కల్పించినా కొందరికి మాత్రమే న్యాయం దక్కుతోందన్నారు. న్యాయం చేయడంలో జాప్యం, అసమర్థత చోటు చేసుకుంటే ఆ తీర్పు విలువ కోల్పోతుందని ప్రజలు విశ్వసిస్తారన్న జస్టిస్ బర్గర్ మాటల్ని గుర్తుచేశారు. లాక్‌డౌన్ ప్రకటించాక దేశంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణలు ప్రారంభించిన మొదటిది ఏపీˆ హైకోర్టేనని తెలిపారు. మార్చి 26 నుంచి ఇప్పటి వరకు 27,462 వ్యాజ్యాల్లో ఆన్‌లైన్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టి.. 5,241 కేసుల్ని పరిష్కరించిందన్నారు. కేసుల విచారణ ఆగకూడదన్న స్ఫూర్తితో దీన్ని సాధించగలిగామన్నారు. హైకోర్టు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ బి.రాజశేఖర్, వీఆర్ సెక్షన్ అసిస్టెంట్ ఎస్.ప్రసాద్‌నాయక్ మృతికి నివాళులర్పించారు. అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏపీˆ న్యాయవాదుల మండలి ఛైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి జేయూఎంవీ ప్రసాద్ ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. కరోనా బారినపడి కోలుకున్న కోర్టు సిబ్బంది, అధికారులను.. వారికి చికిత్స అందించిన ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వైద్యులను సన్మానించారు. కోర్టు టెలిఫోన్ డైరెక్టరీని సీˆజేతో కలిసి న్యాయమూర్తులు ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: విజయాల సారథి.. రికార్డుల రారాజు మహేంద్రుడు