RAINS IN AP : కోస్తాంధ్రాను అనుకుని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం. 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు వర్షాలు కురిసే సూచనలున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బి.ఆర్.అంబేడ్కర్ వెల్లడించారు. శుక్రవారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా... మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని.. శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో.. జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు... వెల్లడించారు.
WEST GODAVARI : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో.. వరద ఉద్ధృతికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏకధాటిగా వర్షం కురవగా.. డ్రైనేజీలు నిండి రోడ్లపైకి భారీగా మురుగు నీరు చేరింది. రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై.. వాహనాలు ఆగిపోవడంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా.. డ్రైనేజీ నీరు మెుత్తం రోడ్లపైకి వస్తుందని.. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
VISAKHA : విశాఖలో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. సెంట్రల్ జైల్ సమీపంలోని రామకృష్ణాపురంలో వరద నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంగా భయం భయంగా వరద నీటిలోనే గడిపారు. గతంలో రక్షణ గోడ నిర్మించినా లాభం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ అంతా మునిగిపోయిందని వాపోయారు. చీకట్లో చిన్న పిల్లలతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీశామని కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.
NANDYALA : నంద్యాలలో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. మున్సిపల్ కార్యాలయం ఆవరణలోకి వరద చేరింది. పద్మావతినగర్ వెళ్లే మార్గంలో రహదారి నీట మునిగింది. సంజీవనగర్ రహదారితో పాటు పలు చోట్ల రోడ్లపై నీరు పారడం వల్ల.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
BAPATLA : ఉపరితల ద్రోణి ప్రభావంతో బాపట్ల జిల్లాలో.. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, చీరాల, పర్చూరు, చినగంజాం, మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి.. బాపట్ల, చీరాల, జాండ్రపేట, వేటపాలెంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
PRAKASAM : ప్రకాశం జిల్లా కనిగిరిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కనిగిరి నుంచి పామూరు వెళ్లే ప్రధాన రహదారిపై కొత్తూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రహదారిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో అటుగా వెళ్లే వాహనాలను పోలీసులు ఆపేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఒంగోలులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీటి ప్రవాహంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కంభం చెరువు కట్టకు వెళ్లే దారిని వర్షపు నీరు ముంచెత్తడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
SRIKAKULAM : శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం చినడోకులపాడులో పంటపొలాలు నీటమునిగాయి. వంశధార దేశిబట్టికి రెండుచోట్ల గండిపడింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఏరిగేరిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎడతెరిపి లేని వర్షానికి ఏరిగేరిలో మట్టిమిద్దె కూలడంతో ప్రాణనష్టం తప్పింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వర్షం కారణంగా మిరప, మినుము పంటలు నీటమునిగాయి.
SATYA SAI : శ్రీసత్యసాయి జిల్లా ఎడతెరిపి లేని వానల కారణంగా ధర్మవరం మండలం తిప్పేపల్లిలోని చిత్రావతి వాగు వద్ద వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఓ ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరిని స్థానికులు కాపాడారు. అనకాపల్లి జిల్లా కురిసిన వర్షానికి దేవరాపల్లి ప్రభుత్వాస్పత్రి ఆవరణలోకి నీరు వచ్చి చేరింది. గర్భిణీకి వర్షపునీరు పడకుండా బకెట్లు అడ్డుపెట్టి వైద్యసిబ్బంది ప్రసవం చేశారు.
NANDIGAMA : నందిగామ నియోజకవర్గంలో భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నందిగామ వద్ద శనగపాడు రోడ్ లో వాగు పొంగు ప్రవహించడంతో నందిగామ పెనుగంచిప్రోలు రహదారిలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు నియోజకవర్గంలోని పత్తి మిర్చి పైర్లు దెబ్బతింటున్నాయి. నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 10000 ఎకరాల్లో మిర్చి వేశారు. పత్తిపైర్లు పూత పిందె కాయ దశలో ఉన్నాయి. ప్రస్తుతం భారీ వర్షాలకు పూత, పిందెలు రాలిపోతుండటంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. చందాపురం రోడ్డులో నల్లవాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఆయకట్టు పైర్లు వరద ముంపుకి గురవుతున్నాయి.
ANANTAPUR : అనంతపురం జిల్లాలో వాగులు ఆక్రమణతో.. వర్షపు నీరు .. జనావాసాలను ముంచెత్తింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు .. నడిమొంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రుద్రంపేట వద్ద వంతెన నిర్మాణం మధ్యలో నిలిపేయడంతో ..వరదనీరు ఇళ్లలోకి చేరింది . అక్రమంగా నిర్మాణాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయని.. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆర్‌డీవో మధుసూదన్ తెలియజేశారు . నీటమునిగిన కాలనీలను ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పర్యటించారు .
MARKAPURAM : ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బొడిచెర్ల వద్ద గుండ్లకమ్మ ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. కొనకనమిట్ల మండలం నాయుడుపేటలో ఇళ్లల్లోకి నీరు చేరింది. సామాన్లు తడిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
NTR : జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ….విజయవాడ గ్రామీణ మండలంలోని చాలా గ్రామాలు జలమయమయ్యాయి. విజయవాడ - నూజివీడు రోడ్డు .. నున్న గ్రామ సమీపంలో రహదారిపై మోకాళ్లలోతు నీరు చేరింది. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురుగంతా రోడ్డుపైకి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు కొత్తగా పోసిన రోడ్డు మళ్లీ పాడైపోతోందని వాపోతున్నారు.
KADAPA : కడప జిల్లాలో.. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో పలుచోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రొద్దుటూరులో వాగులు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. కడపలో నిన్న రాత్రి నుంచి ఓ మోస్తారుగా వర్షం కురుస్తూనే ఉంది. వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకల వద్దకు ఎవరు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
PRAKASAM : ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బేస్తవారిపేట, కంభం, కొమరోలు, అర్ధవీడు ప్రాంతాలలో ….జంపలేరు, గుండ్లకమ్మ, పులి వాగు, నల్ల వాగులకు వరద పోటెత్తింది. కంభం, బేస్తవారిపేటలో ఇళ్లల్లోకి వరద చేరింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వందల ఎకరాలలో అరటి తోటలు నీటమునిగాయి. కంభం చెరువుకు నీరు పోటెత్తింది. మరో 24 గంటల పాటు వానలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ..ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి: