Ramappa Temple: రామప్ప దేవాలయం.. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక కట్టడం. కాకతీయులు మేధోసంపత్తిని, గజ, అశ్వ, సైనిక బలాలను ఉపయోగించి ఇసుక దిబ్బపై ఎంతో నేర్పు, పరిజ్ఞానంతో నిర్మించిన రాతి కట్టడం అధిక వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. పురావస్తుశాఖ నిర్లక్ష్యం కారణంగా ఏటా వర్షాకాలంలో ఏదో ఒక సమస్య తలెత్తుతోంది. ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రామప్ప ఆలయం చుట్టూ వరదనీరు చేరుతోంది. నలుమూలలా మురుగుకాల్వల్లో పూడిక మట్టి చేరింది. రామప్ప ఉపాలయాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కనీసం వరదనీటిని ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
గతంలో తలెత్తిన సమస్యలు..
* 2020లో ఆలయం ఈశాన్యభాగంలోని ప్రహరీ వర్షాలకు కూలింది. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు.
* 2017లో ఆలయానికి వెళ్లే మార్గంలో.. ప్రస్తుత పార్కింగ్ స్థలానికి దగ్గరలోని శివాలయం కూడా కూలిపోయింది. దీనిని పునరుద్ధరించలేదు.
* 2015లో నీరు లీకవుతున్న ప్రాంతాలను గుర్తించి పైభాగంలోని ఒక పొరను పూర్తిగా తొలగించారు. కొత్తగా మళ్లీ శ్లాబ్ వేసినా ఫలితం లేకపోయింది.
* 2014లో ఆలయంలోని మరో 4చోట్ల నీరు కారడం మొదలైంది. దాన్ని అరికట్టడం కోసం పురావస్తుశాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు చేశారు. పనులు నామమాత్రంగా చేయడంతో సమస్య మళ్లీ ఉత్పన్నమైంది.
* 2013లో ఆలయంలోని ఈశాన్యభాగంలో చిన్నగా నీరు కారడం మొదలైంది. దాంతో అప్పుడప్పుడు పెచ్చులూడుతున్నాయి.
ఇవీ చేయాల్సిన పనులు.. రామప్ప పర్యవేక్షణకు ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలి. ఆలయ పరిధిలోని పురావస్తు శాఖ అధికారులు సైతం నిత్యం రామప్పలో ఉండి విధులు నిర్వర్తించేలా చూడాలి.
* కాకతీయులు ముందుచూపుతో ఆలయం నలుమూలలా మురుగు కాల్వలను నిర్మించారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పూడిక లేకుండా చేసి వర్షపు నీరు సాఫీగా బయటకు వెళ్లేలా చూడాలి.
* ఆలయ ప్రాంగణంలో నీటి గుంతలు లేకుండా చూడాలి. పడిన ప్రతి వర్షపు చుక్కా బయటకు వెళ్లేలా చూడాలి.
ఇవీ చదవండి: