RAINS IN HYD: భాగ్యనగర వాసులపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపుతున్నాడు. గత మూడు, నాలుగు రోజులుగా తెరిపినిచ్చిన వాన.. నేడు ఉదయం నుంచి మళ్లీ మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ ప్రాంతాలలో ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షానికి వరద నీరు రహదారులపైకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కోఠిలో దుకాణాలలోకి నీరు చేరి.. వ్యాపారులకు నష్టాన్ని మిగిల్చింది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, నాంపల్లి, అంబర్‌పేట్, ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది.
సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, బొల్లారం, జవహర్‌నగర్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, మారేడుపల్లి, మెట్టుగూడ, రాణిగంజ్, రెజిమెంటల్ బజార్‌లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, పాటిగడ్డ, బ్రాహ్మణవాడి బస్తీల్లో కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ వర్షం పడింది. దాంతో కొన్ని ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లోని ప్రసూన నగర్, మల్లికార్జున నగర్, వాని నగర్, ఇంద్ర సింగ్ నగర్, శ్రీనివాస్ నగర్‌ను వరద ముంచెత్తింది. నాలాల్లోని వరద కాలనీల్లోకి రావడంతో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. సురారం ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీ రాంనగర్, వెంకటేశ్వర కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. జీడిమెట్ల డిపో వద్ద వరద నీరు రోడ్డుపై నిలిచింది.
వెంటనే బయటకు రావొద్దు..: భారీ వర్షం నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నగరవాసులకు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్లపైకి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్లపైకి రాకుండా గంట తర్వాత రావాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలోని రోడ్లపైకి చేరిన నీరు బయటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే అవకాశముంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
నేడు, రేపు వర్షాలు..: మరోవైపు షియర్ జోన్ ప్రభావంతో నేడు, రేపు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్‌లోనూ రాగల రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇవీ చూడండి..