పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని సెలెక్టు కమిటీ ముందు ఉంచేందుకు కార్యదర్శి చర్యలు తీసుకోకపోవడాన్ని, బిల్లుల్ని శాసనసభలో మళ్లీ ప్రవేశపెట్టడాన్ని సవాలు చేస్తూ... తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఆగస్టు 6కు వాయిదా పడ్డాయి. ఎమ్మెల్సీ తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ... ఈలోపు బిల్లుల్ని పరిగణనలోకి తీసుకొని గవర్నర్ చట్టాలుగా చేసే అవకాశం ఉందన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాంటి పరిస్థితి వస్తే తామే చూసుకుంటామని వ్యాఖ్యానించింది.
శాసన మండలి బిల్లుల్ని సెలెక్టు కమిటీకి పంపినప్పటికీ.. మళ్లీ శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని సవాలు చేస్తూ... ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో పాటు.. రాజధానితో ముడిపడి ఉన్న మొత్తం 32 పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఉత్తర తీర ప్రాంతం, రాయలసీమ ప్రాంత ప్రజల తరపున దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను ఇంప్లీడ్ అనుమతించాలని న్యాయవాదులు చంద్రశేఖర్, నాగిరెడ్డి కోరగా... ప్రస్తుతం అనుమతించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపి.. అకౌంటెంట్ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావుకు సూచించింది.
అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ... ఆ వివరాల్ని ఇప్పటికే కోర్టు ముందు ఉంచామన్నారు. ప్రస్తుతం తామేమి విచారణ జరపడం లేదన్న ధర్మాసనం... ఆగస్టు 6కు వాయిదా విచారణను వాయిదా వేసింది. తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ... బిల్లుల విషయంలో కార్యదర్శి సెలెక్టు కమిటీని ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నారని, బిల్లులు కమిటీ ముందు పెండింగ్‌లో ఉండగా శాసనసభ మరోసారి ప్రవేశ పెట్టడాన్ని సవాలు చేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... తదుపరి వాయిదా రోజు (ఆగస్టు 6న) విచారణ జరుపుతామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయాలని కోరతామంది.
ప్రస్తుత హైకోర్టు భవనం ఆవసరాలకు సరిపడటం లేదని, శాశ్వత హైకోర్టు భవనం నిర్మించేలా ఆదేశించాలని న్యాయవాది డీఎస్ఎన్ ప్రసాదబాబు కోరారు. న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఏపీ విభజన చట్టంలోని నిబంధనలను అమలు చేసేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ... 2018లో వ్యాజ్యం దాఖలు చేసినా ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు. రాజధాని ఎక్కడ నిర్మించాలనే అంశంపై రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఇదీ చదవండీ... రాజధాని బిల్లుల వ్యవహారంపై వివరాలు కోరిన పీఎంవో