న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠను కించపరిచేలా వైకాపా నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలు ఉన్నాయని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. రెడ్డి, రెడ్డియేతర సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచగొట్లేలా ఆయన ప్రసంగం ఉందని సీబీఐ తరపు అదనపు సొసిలిటర్ జనరల్ ఎన్వీ రాజు వాదనలు వినిపించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల నేపథ్యంలో తాము కేసు నమోదు చేశామన్నారు. సీబీఐ కేసు నమోదు చేయడంపై పిటిషనర్‌కు అభ్యంతరం ఉంటే డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాలు చేసుకోవాలన్నారు.
సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టుల వ్యవహారం తీవ్రమైనదన్నారు. పిటిషనర్ చెబుతున్నట్లు ఇది చిన్న కేసు కాదన్నారు. విచారణకు పిటిషనర్ సహకరించడంలేదని తెలిపారు. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. విచారణ కోసం హాజరుకావాలంటూ పిటిషనర్‌కు ఎప్పుడు నోటీసు ఇస్తారో తెలియజేయాలని తెలపాలన్నారు. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఈమేరకు ఆదేశాలిచ్చారు.
న్యాయవ్యవస్థపై వ్యాఖ్యల నేపథ్యంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా జరిగిన విచారణలో పోలీసులకు ఫిర్యాదిదారు/ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తరపు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ... ఈ దశలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. న్యాయవ్యవస్థపై దూషణల వ్యవహారం కేసుల దర్యాప్తును డివిజన్ బెంచ్ పర్యవేక్షిస్తోందని తెలిపారు. కుట్రకోణాన్ని తేల్చాలని ధర్మాసనం తీర్పు ఇచ్చిన కారణంగా సీబీఐ కేసు నమోదు చేసిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పిటిషన్ ధర్మాసనం ముందుకు విచారణకు పంపడం మంచిదని అభిప్రాయపడ్డారు. హైకోర్టు సీజే నిర్ణయించిన రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. ధర్మాసనం ముందు ఉన్న వ్యాజ్యాలతో ప్రస్తుత పిటిషన్‌కు సంబంధం లేదన్నారు. అక్కడికి పంపాల్సిన అవసరం లేదని చెప్పారు.
రెడ్డి, రెడ్డియేతరుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పిటిషనర్ వ్యాఖ్యలు చేయలేదని నిరంజన్ రెడ్డి తెలిపారు. పిటిషనర్ రెడ్డి కాదన్నారు. డాక్టర్ సుధాకర్ కేసు వ్యవహారం పెట్టికేసు అని, దాని దర్యాప్తును సీబీఐకి అప్పగించడంపై పిటిషనర్ వ్యాఖ్యలు చేశారు తప్ప.. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ గురించి కాదని స్పష్టం చేశారు. సీబీఐ తాజాగా 41 ఏ నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి .. పిటిషనర్‌కు ఎప్పుడు నోటీసు ఇస్తారో తెలియజేయాలని సీబీఐని ఆదేశిస్తూ... విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు.
ఇవీ చదవండి: