'అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతోంది' - Vaccination in ap news
వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లలో ఏర్పడిన అపోహల కారణంగానే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతోందని... వైద్యారోగ్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని స్పష్టం చేశారు. మొదటి దశలో ఇప్పటి వరకూ 1.89 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయగలిగామని తెలిపారు.
అపోహల కారణంగానే తొలివిడత కార్యక్రమంలో ఇప్పటి వరకూ 49 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి చేయగలిగినట్టు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. వాస్తవానికి తొలిదశలో 3.83 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కారణంగా 79 దుష్ప్రభావ ఘటనలు నమోదు అయ్యాయని వెల్లడించారు.
ఒంగోలులోని డెంటల్ డాక్టర్‌కు వ్యాక్సినేషన్ అనంతరం ఆరోగ్యం విషమించటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తెలియచేశారు. రాష్ట్రంలో చనిపోయిన ఆశా వర్కర్‌కు రూ.50 లక్షల పరిహారం ఇస్తున్నట్టు వెల్లడించారు. రెండో దశ వ్యాక్సిన్‌ను పురపాలక, పంచాయతీరాజ్ శాఖ పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ, పోలీసు విభాగాలకు ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు.
ఇందుకోసం 5 లక్షల మంది వరకూ నమోదు చేసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానున్నట్టు మంత్రి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఆశా వర్కర్ వ్యాక్సినేషన్ వల్ల చనిపోయారని సీఎస్ కేంద్రానికి రాసిన విషయం వైద్యారోగ్య శాఖ దృష్టికి రాలేదని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ... తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు.. కారు ధ్వంసం