రాష్ట్రంలో 108, 104 కొత్త వాహనాలు ప్రవేశపెట్టడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఎప్పటిలాగే చంద్రబాబు, తెదేపా నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాలపై కూడా ఇలానే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి మండలానికి 108, 104 వాహనాలు అందించామని తెలిపారు.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గ్రామాలకు వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా చేశామన్నారు. సుజాతారావు కమిటీ సిఫారసుల మేరకు వైద్య, ఆరోగ్యశాఖను బలోపేతం చేశామని తెలిపారు. వాహనాలను కేంద్ర ప్రభుత్వ ఈ మార్కెట్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేశామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్కో వాహనానికి... 26 వేలు ఆదా చేశామని... మొత్తం రూ.185 కోట్లు ఆదా అయ్యాయన్నారు. ఒప్పందంలో ఏడు సంవత్సరాల పాటు రేటు పెంచకుండా సేవలు అందించాలని నిర్ణయించామన్నారు. అగ్రిమెంట్ ప్రకారం డీజిల్ ధరలు పెరిగినా ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వసతి గృహాల నిర్మాణంపై కర్ణాటక, తితిదే మధ్య ఒప్పందం