దేశ ఆభివృద్ధికి తోడ్పాటునందించే... 6 మూల స్తంభాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చాం అన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్..... వాటిలో ప్రథమ ప్రాధాన్యం వైద్య రంగానికే ఇచ్చారు. దీంతో ఈ రంగ ప్రాముఖ్యతను ఇన్నాళ్లకు గుర్తించినట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా... వైద్య, ఆరోగ్య రంగ కేటాయింపులు సరిపడిన స్థాయిలో జరగడం లేదని, దేశ జీడీపీలో కేటాయించాల్సిన శాతానికి దరిదాపుల్లో కూడా నిధులు కేటాయింపులు జరగడం లేదని నిపుణులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ... కరోనా సృష్టించిన విపత్తుతో వాస్తవంలోకి వచ్చాయి పాలక పక్షాలు. గతంలో లేని తీరుగా పెద్దమొత్తంలో నిధులు ఇస్తున్నట్లు పార్లమెంటు సాక్షిగా ప్రకటించి.. వైద్య ఆరోగ్య రంగ అభివృద్ధి తక్షణ అవసరమని చెప్పకనే చెప్పాయి.
భారీ కేటాయింపులు
2021-22 ఏడాదికి వైద్యరంగానికి ఏకంగా.. 2 లక్షల 23 వేల 846 కోట్ల భారీ కేటాయింపులు జరిపారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను... గతేడాది 94 వేల 452 కోట్ల కేటాయింపులతో పోల్చితే దాదాపు 137 శాతం పెరుగుదల ఉందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ పరిణామాన్ని ఆరోగ్య, వైద్య రంగాల నిపుణులు ఆహ్వానిస్తున్నారు.
వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యం
దేశ ఆర్థిక రంగాన్ని బలంగా దెబ్బతీసిన కరోనాను తుదముట్టించే టీకా కార్యక్రమానికీ మంచి కేటాయింపులే జరిగాయి. వైరస్ వ్యాప్తిని కట్టడిచేసే వ్యాక్సినేషన్ ప్రక్రియకు 35వేల కోట్లు నిధులు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 68.6 కోట్ల జనాభాకు డోసుకు 255 రూపాయల చొప్పున రెండు డోసుల టీకాలను ఇవ్వాలని లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒకవేళ డోసుల ధర పెరిగితే బడ్జెట్‌ను మరింత పెంచుతామని సీతారామన్ తెలిపారు. ఇప్పటి వరకు... కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నట్లు ప్రకటించిన ఆమె... ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు, క్రియాశీల కేసుల రేటు అత్యంత తక్కువగా ఉంది అన్నారు.
పొరుగు దేశాలకు సరఫరా చేస్తున్నాం
ప్రస్తుతం దేశంలో 2 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, వీటిని దేశీయ అవసరాలకే కాక ... పొరుగు దేశాలు, మిత్ర దేశాలకూ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే దేశంలో మరో 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. దీంతో పాటే... దేశీయంగా తయారైన న్యూ మోకోకల్ వ్యాక్సిన్.. ప్రస్తుతం 5 రాష్ట్రాలకే పరమితమైందన్న మంత్రి... దీన్ని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ప్రమాదకర న్యూమోనియా నుంచి రక్షణకు వినియోగిస్తున్నారు. కాగా.. ఈ వ్యాక్సిన్‌ను అన్ని ప్రాంతాలను విస్తరించడం ద్వారా... దేశవ్యాప్తంగా ఏడాదికి 50వేలకు పైగా శిశుమరణాలను తగ్గించవచ్చని తెలిపారు. Spot
ఇతర దేశాల్లో వైద్య, ఆరోగ్య రంగానికే ప్రాధాన్యత
వైద్య, ఆరోగ్య రంగాలకు ఆభివృద్ధి చెందిన దేశాలతో పాటు.. వర్థమాన దేశాలు భారీగానే కేటాయిస్తూ వస్తున్నాయి. మన పొరుగున ఉన్న చైనా... తన మొత్తం జీడీపీలో 3.2 శాతానికి సమానమైన నిధులు, అమెరికా 8.5 శాతం, జర్మనీ 9.4 శాతం కేటాయింపులు చేస్తుండగా.. భారత్ 1.2 % నుంచి 1.6% మధ్యలోనే నిధులను వెచ్చిస్తోంది. చివరి ఏడాది బడ్జెట్‌లో దేశ జీడీపీలో 1.3% నిధులు వైద్యరంగానికి ఖర్చు చేయగా.. ప్రస్తుతం ఈ నిష్పత్తిని ఎప్పుడు భారీగా పెంచారు. రానున్న కాలంలో ఈ కేటాయింపులు మరిన్ని పెరుగవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు.
ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన
దేశ ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త పథకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజనగా పిలవనున్నారు. ఇది ప్రస్తుతం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌కు ఇది అదనం. ఈ పథకం కింద రానున్న ఆరేళ్లల్లో 64 వేల 180 కోట్లు ఖర్చు చేయనుండగా.. దేశంలోని ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో ఆరోగ్య కేంద్రాల సామర్థ్యాన్ని మరింత పెంచనున్నారు. దీంతో మొత్తం జనాభాలోని 40 % జనాభాకు మేలు చేకూరనుంది. Spot
ఆరోగ్య నిఘా కొనసాగుతుంది
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ -ఎన్సీడీసీ , దాని 5 ప్రాంతీయ శాఖలు, 20 మెట్రోపాలిటన్ ఆరోగ్య నిఘా విభాగాలను బలోపేతం చేయనున్నారు. అందరికీ సమీకృత ఆరోగ్య సమాచార పోర్టల్ విస్తరణకు ఈ పథకం సహాయపడునుందని మంత్రి తెలిపారు. దీంతో పాటు.. అన్ని ప్రజారోగ్య ప్రయోగశాలలను అనుసంధానించి దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీంతో పాటే... దేశంలోకి ప్రవేశించే వారిపై పూర్తి స్థాయి ఆరోగ్య నిఘాను కొనసాగించనున్నారు.
ల్యాబ్‌ల ఆవశ్యకతను గుర్తు చేసిన కరోనా
కరోనా వైరస్ భవిషత్త్‌లో మానవాళి ఎదుర్కోనున్న ముప్పులు ఏ తీరుగా ఉండడనున్నాయో స్పష్టం చేసింది. దాని కారణంగానే ఎన్నో మార్పుచేర్పులకు గురైన వైద్య, ఆరోగ్య రంగం వైరస్‌లపై పరిశోధనలు చేసే వైరాలజీ ల్యాబ్‌ల అవసరాన్ని గుర్తించింది. కరోనా సమయంలో దేశంలోని అన్ని ప్రాంతాలను నుంచి నమూనాలు ఒక్క పుణే వైరాలజీ ల్యాబ్‌కే పంపడం ఎంత కష్టమైందో గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా 4 కొత్త వైరాలజీ ప్రయోగశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఒక జాతీయ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతం కోసం... ప్రత్యేక ప్రాంతీయ పరిశోధనా వేదిక ఏర్పాటుతో పాటు... మూడో స్థాయి బయో రక్షణ ఉండే 9 పరిశోధనాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మిషన్ పోషన్ 2.0
దేశంలో చిన్నారుల్లో పౌష్టికార సమస్యను నివారించేందుకు గానూ.. సప్లిమెంటరీ పోషకాహార పథకం, పోషన్ అభయాన్ పథకాలను కలిపి.. మిషన్ పోషన్ 2.0 కు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా పోషకాహారం, సరఫరా, అందరికీ చేరవేత, ఫలితాలను మెరుగుపరుచు కోవాలని ఆశిస్తున్నారు. దీంతోపాటే... మహిళా శిశు సంక్షేమ శాఖకు కేటాయించిన 24 వేల 435 కోట్లల్లో 20 వేల 105 కోట్లను అంగన్‌వాడీలు, పోషన్ 2.0 కు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇది సమీకృత బాలల అభివృద్ధి సేవలు, అంగన్‌వాడి, పోషన్ అభయాన్, కౌమార బాలికల పథకం, జాతీయ క్రీచ్ పథకాలకు కేంద్రంగా పనిచేస్తుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: తయారీ రంగానికి పెద్దపీట