మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో నిందితుడు , మృతుని మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు కడప చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిన అవసరం లేదని సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు హైకోర్టులో వాదనలు వినిపించారు . అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అప్రూవర్గా మారేందుకు సీజేఎం కోర్టు ఉత్తర్వులిచ్చిందని తెలిపారు . ఆ ఉత్తర్వులు సరైనవేనన్నారు . దిగువ కోర్టులో దాఖలు చేసిన ప్రాథమిక అభియోగపత్రం , సాక్షుల వాంగ్మూలాల వివరాలు రికార్డును సీల్డ్ కవర్లో హైకోర్టులో దాఖలు చేశారు . మరోవైపు దస్తగిరి అప్రూవర్గా మారేందుకు కడప కోర్టు అనుమత్విడంపై వివేక హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి , మరో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు . సీజేఎం ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు . నేర నిరూపణకు సాక్ష్యాలు లేనప్పుడు మాత్రమే అప్రూవర్ గా మారేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. మరోవైపు దస్తగిరి తరపు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ .. అప్రూవర్ గా మారేందుకు కడప కోర్టు అనుమతిస్తూ క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలుచేయడానికి వీల్లేదన్నారు . ఇతర సాక్ష్యాలు లభ్యంగా ఉన్నాయనే కారణంగా అప్రూవర్ గా మారేందుకు అవకాశం ఇవ్వకూడదని పిటిషనర్లు చెప్పడానికి వీల్లేదన్నారు . ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ .. తీర్పును వాయిదా వేశారు.
ఇదీ చదవండి: EMPLOYEES JAC LEADERS: ' అందరిదీ ఒకే మాట, ఒకే వాదన, ఒకే డిమాండ్'