high court: జగనన్న విద్యా కానుక పథకం కింద పాఠశాల బ్యాగుల పంపిణీ నిమిత్తం జారీచేసిన టెండర్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. టెండర్ నిబంధనల్లో ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పుడే న్యాయస్థానాలు జోక్యం చేసుకోగలవని తెలిపింది. టెండర్ నిబంధనల రూపకల్పన , కాంట్రాక్టు అప్పగింత ప్రభుత్వ పరిధిలోనిదని పేర్కొంది. ప్రీ - బిల్డింగ్ సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన టెండర్ ప్రక్రియలో పాల్గొనడం కాదంది. సంచుల పంపిణీకి సంబంధించిన టెండర్ నిబంధనలను సవాలు చేస్తూ అట్ల ప్లాస్టిక్స్ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది.
హైకోర్టును ఆశ్రయించిన అట్ల ప్లాస్టిక్ సంస్థ..
ప్రభుత్వ పాఠశాలన్నింటిలో సంచుల పంపిణీ కోసం గతేడాదిలో ఇచ్చిన టెండర్ ప్రకటన నిబంధనలను సవాలు చేస్తూ అట్ల ప్లాస్టిక్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ జడ్జి టెండర్‌ను రద్దు చేస్తూ తాజాగా ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ఆ ఉత్తర్వులపై ప్రభుత్వం ధర్మాసనం వద్ద అప్పీల్ వేసింది. టెండర్ దక్కించుకున్న సంస్థ వాదనలు విని తాజాగా తేల్చాలని ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దకే పంపింది. ఈ నేపథ్యంలో జస్టిస్ దుర్గాప్రసాదరావు ఈ వ్యాజ్యంపై విచారణ చేశారు. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ .. పిటిషనర్ టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదన్నారు.
ఆ షరతును తప్పుపట్టలేం..
టెండర్లో పాల్గొనేవారి గత మూడు సంవత్సరాల వార్షిక టర్నోవర్ రూ. 100 కోట్లకుపైగా ఉండాలని పేర్కొనడంపై పిటిషనర్ అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. 90 రోజుల్లో 45 లక్షల సంచులు సరఫరా చేయడం చిన్నపనికాదన్నారు. బిడ్డర్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకునేందుకు ఆ నిబంధన పెట్టారన్నారు. ఈ నేపథ్యంలో ఆ అర్హత షరతును తప్పుపట్టలేమన్నారు. మరోవైపు టెండర్ దాఖలు చేయని వ్యక్తి దాని చట్టబద్ధతను ప్రశ్నించలేరన్నారు. టెండర్ దక్కించుకున్న శివ నరేశ్ స్పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు అనుకూలంగా టెండర్ నిబందనలు రూపొందించారని పిటిషనర్ ఆరోపించడం తప్ప .. అందుకు తగిన ఆధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయరన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: ఉద్యోగుల సమ్మెను నివారించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ