విశాఖ జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం విశాఖపట్నం డివిజన్లో 9 మండలాలు, అనకాపల్లి డివిజన్లోని అనకాపల్లి మండలంలో మొత్తం 6116 ఎకరాల భూముల్ని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సమీకరిస్తున్నారని పేర్కొంటూ భూసేకరణ ల్యాండ్ పూలింగ్ రైతు కూలీ నిర్వాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.శ్రీరామ్ హైకోర్టులో పిల్ వేశారు. సమీకరిస్తున్న భూమిలో ఎక్కువ శాతం అసైన్డ్ భూములున్నాయన్నారు. ఈ వ్యవహారమై ప్రభుత్వం జారీచేసిన జీవో 72 ను రద్దు చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై 2020 మార్చి 23న విచారణ జరిపిన ధర్మాసనం.. భూములను స్వాధీనం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిగింది.
వ్యవసాయ కూలీల ప్రయోజనాలను కాపాడాలి..
భూసేకరణ చట్టం, ఏపీ మెట్రోపాలిటన్ రీజన్ , అర్బన్ డెవలప్మెంట్ అథార్జీస్ చట్టం -2016 నిబంధనలకు విరుద్ధంగా భూమిని సమీకరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. అసైన్డ్ భూమిని సహజంగా సమీకరించడానికి వీల్లేదన్నారు. సమీకరించేందుకు ముందుగా పత్రిక ప్రకటన ఇవ్వలేదని.. ప్రజల నుంచి అభ్యంతరాల సేకరణ జరపలేదన్నారు. ముఖ్యంగా ఆ భూములపై ఆధారపడి జీవించే వ్యవసాయ కూలీలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదన్నారు. భూసేకరణ చట్టం -2013 నిబంధనల ప్రకారం కల్పించాల్సిన ప్రయోజనాల నుంచి తప్పించుకునేందుకు 'భూసమీకరణ ' విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ కూలీల ప్రయోజనాలను పరిరక్షించేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
అసైన్డ్ దారులు అంగీకరించారు..
1.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం భూమిని సమీకరిస్తోందని ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. అసైన్డ్ భూములతోపాటు మొత్తం 6 వేలకు పైగా ఎకరాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు అసైన్డ్‌దారులు సైతం అంగీకార పత్రాలను ఇచ్చారని తెలిపారు . అసైన్డ్ దారులే వ్యవసాయ కూలీలని.. వారి భూముల్లో వారే వ్యవసాయ పనులు చేసుకుంటున్నారని ధర్మాసనానికి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ భూములపై ఆధారపడి జీవనం సాగించే వ్యవసాయ కూలీలు లేరన్నారు. పిల్‌కు విచారణ అర్హత లేదని.. కొట్టేయాలని కోరారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. భూసమీకరణ వల్ల ప్రభావిత అవుతున్న వ్యవసాయ కూలీలు ఎంతమంది, వారెవరో చెప్పాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అసైన్డ్ దారులే భూములు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినప్పుడు ప్రజాహిత వ్యాజ్యాన్ని ఎందుకు అనుమతించాలని ప్రశ్నించింది. తీర్పును రిజర్వు చేసింది.
నందిగామలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే