ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles)కు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో... తెలంగాణలో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8వేల 400 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటికి 35 కోట్ల రూపాయల రాయితీ అందజేసినట్లు లెక్కలు వేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles)కు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, లైఫ్‌టాక్స్‌ను పూర్తిగా రద్దు చేయడం వల్ల వినియోగదారులు వీటి కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఛార్జింగ్ స్టేషన్లు...
కేంద్రప్రభుత్వ ఈవీ ఫర్ ఎనర్జీ (Ev For Energy) పాలసీని కచ్చితంగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో.. రాష్ట్రంలోని జాతీయ రహదారుల వెంట ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బెంగళూరు, నాగ్‌పూర్, విజయవాడ, ఛత్తీస్‌గఢ్ నాలుగు రహదారులను ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles)తో ఇంటిగ్రేడ్ చేసేలా ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. వీలైనంత ఈ ప్రక్రియను పూర్తిచేయాలని రెడ్కో శాఖను సర్కార్ ఆదేశించింది. ఇండియన్ ఆయిల్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఎన్హెచ్ఐఏఐ (NHIAI), ఆర్అండ్బీ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సూచనలు చేసింది.
ఇబ్బందులు తలెత్తకుండా...
ఎలక్ట్రిక్ వాహనాలతో జాతీయ రహదారులపై ప్రయాణించేవారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఇంధన పునరుద్ధరణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే 98 ప్రాంతాల్లో రెడ్కో ఆధ్వర్యంలో 111 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో వీటికి అదనంగా మరో 138 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అందులో 118 హైదరాబాద్‌లో.. కరీంనగర్‌లో పది, వరంగల్‌లో పది ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో పనులు ప్రారంభమవుతాయని.. మార్చి 2022 నాటికి వీటిని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నామని రెడ్కో వివరించింది.
వృద్ధి పెరిగే అవకాశం...
రహదారుల వెంట ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం వల్ల ఈవీ వాహనాల వృద్ధి క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి బెంగుళూరు, విజయవాడ వెళ్లేవారికి మధ్యలో ఛార్జింగ్ అవసరమైతే ఎలా అనే ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
ఇదీ చదవండి: KONDAPALLI: హైకోర్టు ఆదేశాలో.. నేడు కొండపల్లి పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక