గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండల పరిధిలోని చేబ్రోలు, శేకూరు, శలపాడు, సుద్ధపల్లి, వడ్లమూడి తదితర గ్రామాలు ఎర్ర గ్రావెల్‌కు ప్రసిద్ధి. జిల్లాలో ఎవరికైనా సరే గ్రావెల్ కావాలంటే ఈ ప్రాంతం నుంచే వాహనాల ద్వారా తరలిస్తారు. ఆయా పల్లెల్లో దీని తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. క్వారీ యజమానులు ఒక ఎకరానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని, నాలుగైదు ఎకరాల్లో అందినకాడికి తవ్వేస్తున్నారు. తమకు అందుతున్న ముడుపులతో సంతృప్తిచెందుతున్న రెవెన్యూ, గనుల శాఖల అధికారులు ఈ వ్యవహారాన్ని చూడనట్టే నటిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
దోపిడీ ఇలా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన భూమిలో 18 అడుగుల లోపు లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. అలా చేస్తే ఎకరం పరిధిలో 1500 నుంచి 2000 లారీల మట్టి మాత్రమే వస్తుంది. అయితే క్వారీ యజమానులు 80 నుంచి 90 అడుగుల లోతు వరకూ తవ్వేస్తుండడంతో ఎకరం పరిధిలో వారు 8500 నుంచి 9000 లారీల ఎర్రమట్టిని తరలించగలుగుతున్నారు. ఒక లారీ గ్రావెల్ రూ.5 వేల వరకూ ధర పలుకుతున్న నేపథ్యంలో ఎకరం తవ్వితే ఆ యజమానికి సుమారు రూ.4.50 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతోంది. గత మూడు నెలల్లోనే ఇక్కడ సుమారు 50 ఎకరాలకు పైగానే ఇలా తవ్వేశారు.
ప్రజాప్రతినిధి కన్ను
మట్టి తవ్వకం ద్వారా వస్తున్న కోట్ల రూపాయల ఆదాయం గురించి తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఒక్కో ఎకరం గ్రావెల్ తవ్వకానికిగాను తన వాటాగా రూ.30 లక్షలు ఇవ్వాలని హుకుం జారీచేశారు. క్వారీ యజమానులు ఇలా చెల్లిస్తే ఏ ఇబ్బందీ ఉండదు. లేదంటే వివిధ శాఖల అధికారులు తదితరులు విరుచుకుపడతారు. అందుకే ఆ ప్రజాప్రతినిధి అడిగినంత ఇచ్చుకొని వారు తమ పని కానిచ్చేస్తున్నారు. పైగా ఈ యావత్తు వ్యవహారం జిల్లాలోని ఓ కార్మికశాఖ అధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. ఎలాంటి అవాంతరాలు లేకుంటే ఎకరంలోని మట్టిని కేవలం 10 రోజుల్లోపే తవ్వేస్తారు. అయితే కేవలం ఈ ఆదాయంతోనే సంతృప్తిచెందని ఆ ప్రజాప్రతినిధి ఓ ధాన్యం వ్యాపారితో కలిసి నేరుగా ఎర్ర గ్రావెల్ తవ్వకాలకు కూడా శ్రీకారం చుట్టినట్టు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు
గ్రావెల్ తవ్వకాల విషయంలో అక్రమాలు జరుగుతున్నట్టు, క్వారీ యజమానుల నుంచి రాజకీయ నాయకులు డబ్బు వసూలుచేస్తున్నట్టు తన దృష్టికి రాలేదని చేబ్రోలు తహసీల్దార్ బి.ప్రభాకర్ ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. ఎర్ర గ్రావెల్ తవ్వకం, తరలింపు విషయాల్లో ఎవరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా ఉపేక్షించమని, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
ఏలూరు పరిధిలో 'ఆరోగ్య అత్యవసర పరిస్థితి' ప్రకటించండి: చంద్రబాబు