కరోనా నాటి నుంచి విద్యుత్తు వినియోగం పడిపోవడం, బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో ఎస్పీడీసీఎల్ అప్రమత్తమైంది. ఉన్నత స్థాయి ఆదేశాలతో బిల్లులు రాబట్టడానికి ఉపక్రమించింది. తిరుపతి సర్కిల్ పరిధిలో ప్రభుత్వశాఖల నుంచి దాదాపు రూ.794.83 కోట్లు బకాయిలు పేరుకున్నాయి. సంస్థ ఆర్థిక పరిస్థితులతో.. బకాయిలపై ఒత్తిడి పెంచాలనే ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాలకు హెచ్చరికలతో పాటు సర్వీసులు నిలిపివేస్తున్నారు. చిత్తూరులో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి సైతం సరఫరా నిలిపివేసింది. బకాయిలున్న ఇతర కార్యాలయాలకు హెచ్చరిక నోటీసులు జారీ చేసింది.
నిధులుండీ చెల్లించని పంచాయతీలు
జిల్లాలోని 1,412 గ్రామ పంచాయతీలకు 28 వేల విద్యుత్ సర్వీసులున్నాయి. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా రూ.763 కోట్ల బకాయిలు పేరుకున్నాయి. పంచాయతీలకు కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు తరచూ వస్తున్నాయి. ఈ నిధులతో చెల్లించే సౌలభ్యం ఉన్నా... రాజకీయ ప్రమేయంతో చేపట్టిన పనుల బిల్లుల కోసం మళ్లించుకుంటున్నారు. దీంతో వాటి చెల్లింపునకు అవసరమైన నిధులు లేకుండాపోయాయి. ఇక్కడ ఎస్పీడీసీఎల్ సర్వీసులు నిలిపివేసే పక్షంలో మంచినీటి పథకాలు పనిచేయకుండా తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. పంచాయతీలు నిధులుండీ చెల్లించకుండా ఇతర వాటికి మళ్లించుకుపోయాయి.
![bills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tpt4_0812newsroom_1607404874_996.jpg)
ఎస్పీడీసీఎల్ హెచ్చరిక
పంచాయతీలకు వచ్చిన 14,15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కనీసం మొదటి విడతగా 40 శాతం బకాయిలు చెల్లించాలని ఎస్పీడీసీఎల్ కోరింది. వెంటనే చెల్లించని పక్షంలో కరెంటు సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. నిధులను చాలా పంచాయతీలు వ్యయం చేసినందున చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల పురపాలక, నగరపాలక సంస్థలు కొంత మేరకు బకాయిలు చెల్లించాయి.
ఇదీ చదవండి:
చేయి తడిపితేనే సేవలు.... మసకబారుతున్న విద్యుత్తుశాఖ ప్రతిష్ట