కొందరికి కలెక్టర్లుగా అవకాశం
అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు ప్రతి శాఖలోనూ అధికారులు, సిబ్బందిని జిల్లా పరిపాలనకు తగ్గట్లుగా సర్దుబాటు చేయాలి. సీనియారిటీని అనుసరించి ఐఏఎస్‌లు కలెక్టర్లు అవుతారు. అలాగే జిల్లాకు ముగ్గురు జేసీలు ఉంటారు. వీరిలో ఇద్దరు ఐఏఎస్‌లు.. మరొకరు నాన్ ఐఏఎస్ కేడర్. వీరిని యథాతథంగా కొనసాగిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. చిన్న జిల్లాలు అయినందున వారి సంఖ్యను పరిమితం చేయవచ్చని, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే మాత్రం జిల్లాకు ముగ్గుర్ని కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించే పక్షంలో ఐఏఎస్‌లు ఎక్కువ మంది కావాలి.
జోన్లు ఎలా?
రాష్ట్రంలో ప్రస్తుతం 4 జోన్లు ఉన్నాయి. ఒకటో జోన్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం... రెండో దానిలో ఉభయగోదావరి, కృష్ణా... మూడో దానిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు... నాలుగో దానిలో రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉన్నాయి. కొత్త జోన్లు ఏర్పాటు చేయాలంటే రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాటి పరిధిలోకే అదనంగా జిల్లాలను చేరుస్తారని భావిస్తున్నారు.
సెక్షన్లు అలాగే ఉంటాయా?
జిల్లాల్లో ఒక వైద్య ఆరోగ్యశాఖాధికారి, విద్యాశాఖాధికారి, జాయింట్ డైరెక్టరు (వ్యవసాయం), ఇతర అధికారులు ఆయా శాఖలను పర్యవేక్షిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైతే వీరి తర్వాతి స్థానంలో ఉన్న వారిని ఆయా జిల్లాల అధికారులు (అదనపు డీఈవో, అదనపు డీఎంహెచ్‌వో)గా నియమించవచ్చు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘ఎ’ నుంచి ‘హెచ్’ వరకు సెక్షన్లు ఉన్నాయి. ఇవికాకుండా ‘ల్యాండ్ రిఫార్మ్స్’ సెక్షన్ ఉంది. వీటిని అదేవిధంగా కొనసాగించాలా? పర్యవేక్షణ, పరిధి తగ్గుతున్నందున ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేయాలా? వద్దా? అన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ఇందులో ఉద్యోగుల ‘స్థానికత’ అంశానికి ప్రాధాన్యం ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లే సిబ్బందికి మౌలిక, సదుపాయాల కల్పనపైనా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని పలు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: జగన్ లేఖ కేసు విచారణ.. ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్ కుమార్