రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాల్లోని 21 పట్టణాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపులు చేసింది. 21 పట్టణాల మంచి నీటి అవసరాల కోసం 4.482 టీఎంసీల మేర నీటిని కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మహేంద్ర తనయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని పలాసకు, ఏలేరు కాల్వ నుంచి నర్సీపట్నం, గొల్లప్రోలు, ముమ్మిడివరం పట్టణాలకు నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నది నుంచి తిరువూరు, నందిగామ, ఉయ్యూరు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలకు నీటి సరఫరా చేసేందుకు అవసరమైన పనులు చేపట్టనున్నారు. బుగ్గవాగు నుంచి మాచర్ల, పిడుగురాళ్లకు, జవహర్ కుడి కాల్వ నుంచి వినుకొండకు నీటి సరఫరాకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రాజెక్టుల కోసం ఏఐఐబీ రుణం
రామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి చీమకుర్తికి, కనిగిరికి నీటి కేటాయింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాజెక్టు నుంచి గిద్దలూరుకు నీటి సరఫరా చేయనున్నారు. కేపీ కెనాల్ నుంచి నాయుడుపేట, సూళ్లురుపేటలకు నీటి కేటాయింపులు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అక్కంపల్లి నుంచి మడకశిరకు, పీఏబీఆర్ నుంచి కళ్యాణదుర్గానికి నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం పేర్కొంది. బుక్కపట్నం చెరువు నుంచి పుట్టపర్తికి, గాజులదిన్నె నుంచి ఎమ్మిగనూరుకు నీటి కేటాయింపులు చేస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు ఏఐఐబీ(ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకు) నుంచి రూ. 5050 కోట్ల మేర ఆర్థిక సాయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి : సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం.. కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు