గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ కవి గోరటి వెంకన్న, బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఓసీ వైశ్య సామాజిక వర్గం నుంచి బొగ్గారపు దయానంద్‌ను ఎంపిక చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా గౌరారం గ్రామానికి చెందిన గోరటి వెంకన్న ఉస్మానియా యూనివర్సిటీలో దూరవిద్య విధానం ద్వారా ఎంఏ తెలుగు చదివారు. రేల పూతలు, అలసేంద్ర వంక, పూసిన పున్నమి, వల్లంకితలం తదితర పుస్తకాలను రాశారు. వాగ్గేయకారుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రతిష్టాత్మక కాళోజీ అవార్డుతో గోరటి వెంకన్నను సత్కరించింది.
గోరటి వెంకన్న
వరంగల్‌కు చెందిన బస్వరాజు సారయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. 2012 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఐటీఐ చదివిన బస్వరాజు విద్యార్థి నాయకుడిగా చేశారు.
బస్వరాజు సారయ్య
వాసవీ సేవా కేంద్ర ముఖ్య సలహాదారుడు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ ప్రభుత్వ ప్రొటోకాల్ విభాగం ఉప సంచాలకుడిగా 2003లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన బొగ్గారపు దయానంద్ 2014లో తెరాసలో చేరారు. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన బొగ్గారపు దయానంద్ బీఎస్సీ చదివారు.
బొగ్గారపు దయానంద్
ముగ్గురి పేర్లను ఆమోదించిన మంత్రివర్గం గవర్నర్‌కు పంపించింది. గవర్నర్ ఆమోదిస్తే శనివారమే ముగ్గురూ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.