ఒడిశాలోని కటక్‌లో జరిగిన ఆదికవి శ్రీ సరళాదాస్ 600వ జయంత్యుత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. తొలుత ఉపరాష్ట్రపతి నుంచి ‘కళింగ రత్న’ పురస్కారాన్ని అందుకున్నారు. చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
తరగతి గదులను, తరగతి పుస్తకాలనే కాకుండా అనేక పుస్తకాల ప్రపంచంగా మార్చడం ద్వారా విద్యార్థుల్లో పఠనంతోపాటు వివిధ అంశాలపై ఆసక్తిని పెంపొందించవచ్చని సూచించారు. పరిపాలన, న్యాయ విభాగాల్లో స్థానిక భాష వినియోగాన్ని మరింతగా పెంచడం ద్వారా ప్రజలు తమ విధులను సౌకర్యంగా నిర్వహించేందుకు వీలుంటుందన్న ఉపరాష్ట్రపతి.. కనీసం పాఠశాల విద్య వరకు మాతృభాషలో జరగడం అత్యంత అవసరమన్నారు.
ఇది పిల్లల మేధోవికాసానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. దీన్ని బలపరుస్తూ వెల్లడైన పలు అంతర్జాతీయ పరిశోధనల నివేదికలను ఉప రాష్ట్రపతి తెలిపారు. మాతృ భాషతోనే చిన్నారులకు మనో వికాసం కలుగుతుందని, మాతృభాషలో నేర్చుకున్న విషయాలను జీవితాంతం గుర్తుంచుకుంటారని, అమ్మభాషకు మరింత ప్రాధాన్యం పెరగాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. చిన్నారుల ఆసక్తులకు అనుగుణంగా పుస్తక రచన సాగాలని, అది కూడా మాతృభాషలోనే జరగాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: