రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినందున రోజురోజుకూ ఇసుక లభ్యత పెరుగుతోందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 1 నాటికి 31 వేల 576 టన్నుల ఇసుక సరఫరా కాగా, నవంబరు 7న 86 వేల 482 టన్నులు.. నవంబర్ 8న 96 వేల టన్నుల ఇసుక సరఫరా జరిగిందన్నారు. సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా, పారదర్శకంగా వినియోగదారులకు చేరేలా ప్రభుత్వం నూతన 'శాండ్ మైనింగ్ పాలసీ-2019' అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. దాని అమలు కోసం ఇప్పటికే పటిష్ఠమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖల అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 187 లక్షల టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద నదుల్లో వరద ప్రవాహం అధికంగా ఉండటం వల్ల ఇసుక తవ్వకాలు తగ్గిపోయాయన్నారు. అయితే, తగ్గుతున్న వరదతో గడిచిన నాలుగు రోజుల్లో 3 లక్షల టన్నుల పైచిలుకు ఇసుక లభ్యతలోకి వచ్చిందని తెలిపారు. మొదటి ఆర్డర్, రెండో ఆర్డర్, మూడో ఆర్డర్ వరుస స్ట్రీమ్స్‌లో 300లకు పైగా రీచ్‌లు గుర్తించినట్లు అధికారులు చెప్పారు. నదుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న కొద్దీ మరిన్ని ఎక్కువ రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేస్తామని.. తద్వారా పూర్తి స్థాయిలో అవసరాలు తీర్చగలుగుతామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: