ZONAL SYSTEM: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన(zonal ) జోనల్ వ్యవస్థలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. జోనల్ వ్యవస్థ విధివిధానాలను నిర్దేశిస్తూ 1975లో అమల్లోకి తెచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో ఏమైనా సవరణలు చేయాలా? లేకపోతే పూర్తిగా కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను జారీ చేయాలా? అన్న విషయంలో ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. రాష్ట్ర విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు గతం నుంచి సామాజిక-ఆర్థిక, విద్య, పరిపాలన రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవడం, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రస్తుత అవసరాలు, ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో 11 మంది సభ్యులు ఉన్నారు. రెవెన్యూ(భూములు), ఆర్థిక, వ్యవసాయ, పాఠశాల విద్య, పురపాలక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పంచాయతీరాజ్, ప్రణాళిక, హోం(హెచ్‌ఆర్), వైద్య, ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని (సర్వీసెస్) కమిటీ సభ్యుడిగాను, కన్వీనర్‌గాను ప్రభుత్వం నియమించింది. మార్చి 17న జరిగిన ఏపీపీఎస్‌సీ సమావేశంలో భవిష్యత్తులో చేపట్టే నియామకాల కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ని సమీక్షించాలన్న అభిప్రాయం వ్యక్తమైందని, అదే విషయాన్ని తెలియజేస్తూ బోర్డు కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాశారని ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
రెండు నెలల్లో నివేదిక
కమిటీ అధ్యయనం చేసి రెండు నెలల్లోగా నివేదిక అందజేయాలని ప్రభుత్వం గడువు నిర్దేశించింది. మన రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌తో పాటు, ఇతర రాష్ట్రాల్లోనివీ అధ్యయనం చేయాలని తెలిపింది. ఉద్యోగ, ఇతర సంఘాలు, నిపుణులు, ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని కమిటీ పరిశీలించాలని, చేయాల్సిన మార్పులపై సిఫార్సులతో పాటు, ముసాయిదా ప్రతిపాదనను కూడా కమిటీ అందజేయాలని స్పష్టంచేసింది. ఉద్యోగుల్ని వివిధ కేడర్‌లకు తుది కేటాయింపులు చేసేలోగా అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను కమిటీ అందజేయాలని, ఈ మొత్తం ప్రక్రియలో భాగంగా కమిటీ అవసరమైతే ఆయా రంగాల నిపుణుల సేవల్ని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ చదవండి: