కరోనా విపత్తులోనూ వైకాపా నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. వైకాపా నాయకులు గుంపులుగా తిరుగుతూ ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కరోనా వైరస్ వ్యాప్తని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధుల విడుదల చేసిందన్నారు. మిగిలిన రాష్ట్రాలు వాటితో పాటు తమ వాటా కొంత జతచేసి పేద ప్రజలకు సాయం అందిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్లో అధికారపక్షం మాత్రం కేంద్రం ఇచ్చిన వాటినీ పేదలకు పంచట్లేదని ఆరోపించారు.
3 నెలల రేషన్, 3 నెలల నగదు సాయం ఇవ్వమంటే సీఎం జగన్ దఫాలుగా ఇస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఆర్ధిక సాయంగా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు 14వ ఆర్ధిక సంఘం ద్వారా 1301 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీ కింద, 15వ ఆర్ధిక సంఘం ద్వారా 491.41 కోట్లు, విపత్తుల సహాయ నిధి కింది ముందస్తుగా 559.50 కోట్లు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి.. 'ప్రతి జిల్లాలో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి'