గోదావరి–కృష్ణా అనుసంధానంలో మరో బృహత్తర పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సముద్రంలోకి వృథాగా పోతోన్న గోదావరి జలాలను ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా నూతన ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో అధికారులతో సీఎం జగన్ తన ఆలోచనను వెల్లడించారు. పోలవరం వద్ద ఉన్న గోదావరి జలాలను బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు తరలించేందుకు డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు.
210 టీఎంసీలు తరలించాలని!
గోదావరి ద్వారా వేలాది టీఎంసీల నీరు ఏటా సముద్రంలో వృథాగా కలసిపోతోంది. ఈ నీటిని రోజుకు 2 టీఎంసీల నీరు చొప్పున మొత్తంగా 210 టీఎంసీలు తరలించాలన్నది సీఎం ఆలోచన. తద్వారా నాగార్జున సాగర్ కుడికాల్వ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని... రెండో దశలో ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని భావిస్తున్నారు. అదే విధంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈప్రాజెక్టు ద్వారా తీర్చాలన్నది ప్రతిపాదన.
150 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్!
ప్రాథమిక ఆలోచన ప్రకారం... పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి, అక్కడ నుంచి నాగార్జునసాగర్ కుడికాల్వకు ఎత్తిపోస్తారు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీలతో భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తారు. రిజర్వాయర్‌కు నీటిని లిఫ్ట్ చేస్తారు. బొల్లాపల్లి నుంచి వెలిగొండ రిజర్వాయర్‌కు నీటిని అందిస్తూ.. మరోవైపున నల్లమల అడవుల్లో ఒక టన్నెల్‌ను తవ్వడం ద్వారా కర్నూలు జిల్లాలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు తరలిస్తారు.
ఈ మొత్తం ప్రక్రియలో 460 కిలోమీటర్ల మేర నీటిని గ్రావిటీద్వారా, మరికొన్నిచోట్ల ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. సముద్రమట్టానికి 37 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు ఉంటే.. 260 మీటర్ల ఎత్తులో బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ ఉంది. అంటే 230 మీటర్ల ఎత్తుకు వివిధ దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. మొత్తంగా దీనికోసం 2,100 మెగావాట్ల కరెంటు కావాలి.
60 వేల కోట్లకు పైనే..!
ప్రతిపాదిత ప్రాజెక్టు విలువ రూ.60వేల కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సముద్రంలోకి కలుస్తున్న ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టాలన్నదే తన ఆకాంక్ష అని అధికారులతో ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పుడు సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలను స్థిరీకరించడమే కాకుండా, నిత్యం కరవుతో, తాగునీటి కొరతతో అల్లాడుతున్న ప్రాంతాలకు జలాలను తరలించి వారి కష్టాలను తీర్చాలన్నదే తన ప్రయత్నమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:సత్వర ఫలితాలిచ్చే.. కొత్త ప్రాజెక్టులు చేపట్టండి: సీఎం జగన్