GODAVARI FLOOD: పోలవరం ప్రాజెక్టు ఎగపోటు భద్రాచలంలో గోదావరి తీరవాసులను ముప్పుతిప్పలు పెడుతోంది. నదీ పరీవాహక ప్రదేశంలో చిన్నపాటి వానొచ్చినా ఇక్కడ వరద తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రవ్యాప్తంగా, ఎగువ కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో దిగువన ఉన్న భద్రాచలం వద్ద గోదావరి చిన్న వరద వచ్చిన ముంపునకు గురవుతుంది. గత వంద సంవత్సరాలుగా లేని తిప్పలు ఇప్పుడు పోలవరం రూపంలో వచ్చింది.
సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు 43.2 అడుగుల నీటిమట్టం నమోదు కావడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు 48 అడుగులకు చేరడంతో రెండో హెచ్చరికను కలెక్టర్ జారీ చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు 50 అడుగులుండగా సాయంత్రం 6 గంటలకు 51.6 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 53కి చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ ఏడాది వరుసగా మూడు నెలల్లో నాలుగుసార్లు ప్రమాద హెచ్చరికలు జారీ కావడం భద్రాచలంలో పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
గత వందేళ్ల చరిత్రలో గరిష్ఠంగా జులైలో 71.3 అడుగుల వరద వచ్చింది. ఆగస్టులో రెండుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చింది. భద్రాచలంలో ప్రస్తుతం గోదావరి స్నానఘాట్‌లు చాలావరకు నీట మునిగాయి. కల్యాణకట్ట దిగువకు నీరు చేరింది. వరద పెరుగుతున్నా కరకట్టకు పెద్దగా లీకేజీల బెడద లేకపోవడం ఊరట కలిగించే అంశం. భద్రతను దృష్టిలో ఉంచుకుని కరకట్టపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు కట్టడి చేశారు. అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లోని పరీవాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం-భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం తూరుబాక ప్రధాన రహదారిపై వరద చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి అల్లూరి జిల్లా కూనవరం మండలానికి వెళ్లే మార్గం 10చోట్ల వరద నీటితో మూసుకుపోయింది. భద్రాచలం వైపు వచ్చే లారీ డ్రైవర్లు ప్రమాదకరంగా ప్రయాణాలు సాగించారు. భద్రాచలం నుంచి ఏపీలోని విలీన మండలాలకు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే మార్గాలు వరదతో పోటెత్తాయి.
ఇవీ చదవండి: