గోదావరి నుంచి కృష్ణాలోని పట్టిసీమ, పోలవరం ద్వారా మళ్లించే నీటిలో తమ వాటా అంశం తేల్చాలని తెలంగాణ పట్టుపట్టగా, ఇది ట్రైబ్యునల్ పరిధిలో ఉందని, బోర్డులో చర్చించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ‘కృష్ణాలోకి వచ్చే నీటిలో 45 టీఎంసీలు నాగార్జునసాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వాడుకోవాలి. బేసిన్‌లో ఉన్నది మా ప్రాజెక్టులే. ట్రైబ్యునల్‌లో ఎప్పుడు తేలుతుందో తెలియదు. అంతవరకు తాత్కాలిక ఏర్పాటైనా చేయాలి’ అని తెలంగాణ కోరగా, కృష్ణాలోకి వచ్చే నీటిపై నిర్ణయం తీసుకోవాల్సింది కృష్ణాబోర్డు అని, అక్కడే దీని గురించి చర్చించాలని గోదావరి బోర్డు చెప్పింది. మరోవైపు కొత్తగా చేపట్టిన అన్ని ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు(డీపీఆర్) ఈ నెల పదో తేదీలోగా ఇవ్వాలని బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది. గోదావరి నదీ యాజమాన్యబోర్డు తొమ్మిదో సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగింది.ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు నారాయణరెడ్డి, మురళీధర్, బోర్డు అధికారులు, రెండు రాష్ట్రాల ఇంజినీర్లు పాల్గొన్నారు.
గోదావరి జలాల్లో ఏపీ, తెలంగాణ ఎంత మేరకు వినియోగించుకుంటున్నాయో తేల్చాలంటే ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలి. అవి ఇచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించాయి. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాలని ఆ రాష్ట్రానికి సూచించాం.- బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్
ఏదీ కొత్తగా చేపట్టలేదు: ఇరు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటిపైనా చర్చ జరిగింది.
తెలంగాణ ఫిర్యాదు: పట్టిసీమ ఎత్తిపోతల, పురుషోత్తపట్నం, చింతలపూడి, గోదావరి-పెన్నా అనుసంధానంపై
ఏపీ సమాధానం: పట్టిసీమ, పురుషోత్తపట్నం డీపీఆర్‌లు ఇప్పటికే ఇచ్చాం. గోదావరి-పెన్నా అనుసంధానానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే టెండర్లు పిలిచి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ ప్రభుత్వం పనులు జరగని ఒప్పందాలు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచింది. ఇది కొత్తగా చేపట్టింది కాదు.
ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు: కాళేశ్వరం ఎత్తిపోతల, దేవాదుల మూడవదశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, లోయర్ పెన్‌గంగపై బ్యారేజీలు, తాగునీటి పథకం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు మళ్లింపు పథకాలపై.
తెలంగాణ సమాధానం: దేవాదుల అన్ని దశలు చాలా ఏళ్ల క్రితమే చేపట్టినవి. పనులు మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి. సీతారామ, తుపాకులగూడెంతో సహా అన్ని ప్రాజెక్టులూ గతంలో చేపట్టినవే. గోదావరి నుంచి ఎగువన ప్రవాహం లేకపోవడంతో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ఆయకట్టు ప్రమాదంలో పడింది. ఈ ప్రాజెక్టులను ఆదుకోవడంతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు నీరందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునరాకృతిలో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మించింది. ఆంధ్రప్రదేశ్ పేర్కొన్న ఏ ప్రాజెక్టు కూడా కొత్తగా చేపట్టింది కాదు.
* గోదావరిలో తమకు ఉన్న 967కు పైగా టీఎంసీల నీటి కేటాయింపుల మేరకే ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని తెలంగాణ పేర్కొనగా ఏపీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో అప్పటి పరిస్థితుల మేరకు సాధారణంగా వేసిన లెక్కలని, అసలు ఏ అవార్డులోనైనా కేటాయింపులు ఉన్నాయేమో చూపండి అని ఏపీ అధికారులు డిమాండ్ చేశారు.
* గోదావరిపై 651 టీఎంసీలు వినియోగించుకునేలా ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఉన్నాయని ఏపీ పేర్కొనగా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసి 450 టీఎంసీలకే అని పేర్కొంది. దీంతో ఆమేరకు ఉన్న ప్రాజెక్టులు ఏంటో తెలంగాణ అధికారులు తెలిపితే.. మిగిలిన వాటి వివరాలు అందిస్తామని ఏపీ వెల్లడించింది.
* కాళేశ్వరం ప్రాజెక్టుకు జగన్ అతిథిగా వెళ్లి పాల్గొన్నంత మాత్రాన ఆ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చినట్లు ఎలా అవుతుందని, తోటి రాష్ట్రం పిలిచినందుకు సౌహార్ద్ర భావంతో హాజరయ్యారని ఏపీ అధికారులు పేర్కొన్నారు. తరచూ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలంటూ, తాగునీటి సమస్య తీర్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అంటుంటారని, అది ప్రాజెక్టులకు మద్దతుగా తీసుకోమంటారా అని ఏపీ అధికారులు ఎదురు ప్రశ్నించారు.
టెలిమెట్రీ ఏర్పాటుకు కమిటీ
బోర్డు విడుదల చేసిన ప్రకటన ప్రకారం సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
* కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు గోదావరి బోర్డు పరిశీలనకు అందజేయడానికి తెలంగాణ అంగీకరించింది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఇస్తామంది. ఇప్పటికే ఇచ్చినవి కాకుండా మిగిలిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకొంది.
* కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎజెండాను వెంటనే పంపాలని బోర్డు కోరింది.
* గోదావరి బేసిన్‌లో అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో టెలిమెట్రీల ఏర్పాటు ఎక్కడెక్కడ అన్నది గుర్తించేందుకు గోదావరి బోర్డు సభ్యుని ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. కమిటీలో రెండు రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర జలసంఘం, పుణెలోని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నుంచి సభ్యులు ఉంటారు.