గోదావరి- పెన్నా అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించే పథకం విషయంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ తప్పు దారి పట్టించిందని తెలంగాణ ఆరోపించింది. గోదావరి బోర్డు సమావేశంలో కొత్త ప్రాజెక్టులపై చర్చ జరిగినపుడు గోదావరి-పెన్నా అనుసంధానం, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చెప్పినదానికి, వాస్తవంగా జరుగుతున్న దానికి పొంతనలేదని, బోర్డును తప్పుదారి పట్టించారని పేర్కొంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గోదావరి నదీ యాజమాన్యబోర్డు కార్యదర్శికి తాజాగా లేఖ రాశారు. కృష్ణాడెల్టా, నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టు, రాయలసీమ, నెల్లూరు అవసరాల కోసం పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని 50వేల క్యూసెక్కులకు పెంచుతున్నారన్నారు. గత నెల 16న శాసనసభలో ఈ విషయాన్ని స్పష్టం చేశారని లేఖలో పేర్కొన్నారు. పోలవరం, పట్టిసీమల ద్వారా మళ్లించే నీటిలో తెలంగాణ వాటా అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని, ఈ విషయంలో జాప్యం చేయడానికి నిర్ణయించుకొన్న ఆంధ్రప్రదేశ్ ఉద్దేశపూర్వకంగానే చర్చ జరగకుండా బోర్డును తప్పుదోవ పట్టిస్తోందన్నారు. గోదావరి నుంచి కృష్ణాలోకి నీటిని మళ్లించే అన్ని ప్రాజెక్టుల వివరాలు ఇమ్మని ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించాలని, అప్పటివరకు గోదావరి-పెన్నా అనుసంధానంపై ముందుకెళ్లకుండా చూడాలన్నారు. మిగులు జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా ముందుకెళ్లడానికి వీల్లేదన్నారు. పారదర్శకంగా సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇమ్మని సూచించాలని గోదావరి బోర్డును కోరారు.
కృష్ణా బేసిన్‌లో అన్నీ పాత ప్రాజెక్టులే
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులేవీ కొత్తవి కాదని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది.. కల్వకుర్తి, నెట్టెంపాడు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ సామర్థ్యం పెంపు సహా ఏదీ కొత్తగా చేపట్టినది కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపకల్పన జరిగి చేపట్టినవేనంది.ఆంధ్రప్రదేశ్ కొత్తవిగా పేర్కొన్న ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను ప్రభుత్వంతో చర్చించి ఇస్తామని మాత్రమే ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో చెప్పలేదంది. ఈ ప్రాజెక్టులన్నీ కొత్తవి కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని తెలిపింది. సమాచారం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు కృష్ణా నదీ యాజమాన్యబోర్డుకు అవసరమైతే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్య తీసుకొంటామన్నామని పేర్కొంది. ఈ మేరకు బోర్డు సమావేశపు మినిట్స్‌లో మార్పులు చేయాలని కోరింది.తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ కృష్ణా నదీ యాజమాన్యబోర్డు ఛైర్మన్‌కు తాజాగా రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12వ సమావేశం జూన్ నాలుగున జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్‌ను బోర్డు రెండు రాష్ట్రాలకు పంపింది.
ముఖ్యాంశాలు...
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సామర్థ్యం 30 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచిన నీటి వినియోగం తమ కోటా నుంచేనని, ఈ పథకం నిర్మాణంలో ఉందని తెలంగాణ పేర్కొన్నట్లుగా మినిట్స్‌లో ఉంది. అయితే సొరంగ మార్గం నిర్మాణంలో ఉన్నదే కాబట్టి ఇది కొత్తది కాదని, కృష్ణా బోర్డు పరిశీలనకు డీపీఆర్ అవసరం లేదని పేర్కొన్నట్లుగా మార్చాలని సూచించింది.ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ అందజేయడంతోపాటు బోర్డు , జలసంఘం పరిశీలించి అపెక్స్ కౌన్సిల్ ఆమోదించే వరకు ముందుకెళ్లరాదని మినిట్స్‌లో ఉండగా, కేంద్రజల్‌శక్తి శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని తెలంగాణకు పంపి డీపీఆర్‌లు ఇమ్మని కోరినట్లుగా మార్చాలని సూచించారు.
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం దాదాపు పూర్తయ్యిందని, పిల్లకాలువల పనులు మాత్రమే కొన్ని ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు సామర్థ్యం పెంచింది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనేనని పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టు పెంపు కూడా ముందే జరిగిందన్నారు.మిషన్ భగీరథకు కూడా తమ కేటాయింపుల నుంచే నీటిని వాడుకుంటున్నామని తెలిపారు. మినిట్స్‌లో ఆ మేరకు మార్పులు చేయాలని సూచించారు.
గోదావరి నుంచి మళ్లించే 45 టీఎంసీల విషయంలో అవార్డు ప్రకారం కేఆర్‌ఎంబీ నిర్ణయం తీసుకోవాలని కాకుండా, అవార్డు ప్రకారం నిర్ణయం తీసుకోవడంతోపాటు తెలంగాణ అభిప్రాయం, అవార్డులో ఏముందో వివరంగా పేర్కొంటూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని మార్పు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: బఫెట్‌ను వెనక్కి నెట్టిన ముఖేశ్ అంబానీ