Flexis in Hyderabad: భాగ్యనగరంలో రహదారులపై ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భాజపా, తెరాస శ్రేణులు ఎలాంటి అనుమతి లేకుండానే భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. నగరంలో ఎక్కడ చూసినా అధికార తెరాసతోపాటు భాజపాలకు చెందిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు, కటౌట్లు నగరంలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం మొదలైంది. తమ పార్టీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారంటే.. మావి తొలగిస్తున్నారంటూ ఇరుపార్టీల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వాటిపై నిన్నటి వరకు ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ అధికారులు నేడు జరిమానా విధింపు ఆపేశారు. శుక్రవారం వరకు అనుమతి లేని ఫ్లెక్సీలకు ఈవీడీఎం భాజపాకు రూ. 2 లక్షలు, తెరాసకు లక్ష రూపాయలు జరిమానా విధించింది. గతంలో నగరవాసులు టూలెట్ బోర్డు పెడితే ఫైన్ వేశారు. ఇదిలా ఉంటే.. మరోవైపు డీఆర్ఎఫ్ ట్విట్టర్ అకౌంట్ సర్వర్ డౌన్ అయింది.
నెక్లెస్‌రోడ్‌లో యువజన కాంగ్రెస్ ఆందోళన..: ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ భాజపా, తెరాస జెండాలు ఏర్పాటు చేయడంతో శుక్రవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ ఇతర పార్టీల జెండాలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. యువజన కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జెండాలు తొలగించారు.
సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన తెరాస నేతలు.. : యశ్వంత్ సిన్హాకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను భాజపా కార్యకర్తలు చింపేస్తున్నారంటూ ప్రభుత్వ చీఫ్‌విప్ బాల్క సుమన్ సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఓఆర్‌ఆర్‌పై తమ ఫ్లెక్సీలను చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గచ్చిబౌలీలో సైబరాబాద్ సీపీని కలిసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బాల్క సుమన్ ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను చింపేసిన ఫొటోగ్రాఫ్‌లను సీపీకి అందజేశారు.
ఇవీ చదవండి: మోదీ ప్రధానిగా కాదు.. సేల్స్మెన్లా వ్యవహరిస్తున్నారు : కేసీఆర్