రెండు తెలుగు రాష్ట్రాల్లో.. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులకు అప్పగించాలంటూ.. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గురువారం (అక్టోబరు 14) నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ.. దీనిపై సందేహాలు నెలకొన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తమ పరిధిలోని ప్రాజెక్టులను బోర్డులకు స్వాధీన పరుస్తూ ఉత్తర్వులు జారీ చేయకపోవడమే సందేహానికి కారణం.
బోర్డుల సమావేశం నిర్వహించి, తీర్మానాలు చేసుకున్నప్పటికీ.. రెండు తెలుగు రాష్ట్రాలూ గెజిట్ అమలుపై ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో సందిగ్ధత నెలకొంది. ప్రాజెక్టులు అప్పగించేందుకు ఏపీ సిద్ధమైనా.. తెలంగాణ వైపు నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుండటంతో స్వాధీన ప్రక్రియపై సందేహాలు నెలకొన్నాయి.
వాస్తవానికి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. అక్టోబరు 14 తేదీ నుంచే కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వెళ్లాల్సి ఉంది. ఏపీ నుంచి శ్రీశైలం స్పిల్ వే, కుడివైపున విద్యుత్ కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రినీవా, మల్యాల, మచ్చుమర్రి ఎత్తిపోతల, సుంకేశుల, నాగార్జున సాగర్ కుడికాలువ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లాల్సి ఉంది.
తెలంగాణ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోని ఎడమవైపున ఉన్న విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్, నాగార్జున సాగర్ దిగువన కుడి, ఎడమ కాలువలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, సాగర్ టెయిల్ పాండ్, పులిచింతల, ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుల దిగువన కాలువల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతోపాటు.. జూరాల ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకురాకపోవడం పైనా ఏపీ అభ్యంతరం తెలిపింది. ఈ విధంగా పలు అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడం.. రెండు ప్రభుత్వాలూ జీవోలు జారీ చేయకపోవటంతో.. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు సందిగ్ధంలో పడింది. ఈ విషయంలో ఏపీ, తెలంగాణ సీఎంల నుంచి అంగీకారం వచ్చిన తర్వాతనే.. ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.
ఇవీ చదవండి : Water boards: ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నేటినుంచే కీలక సమావేశాలు.. ఏం జరగనుంది?
Rajath Kumar Comments :కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం